IND vs SA Test: గతంలోకి తొంగిచూస్తే ఉపఖండం ఆవల టెస్టుల్లో టీమ్‌ఇండియా ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ పిచ్‌లపై పరుగులు చేయడంలోనూ, వికెట్లు తీయడంలోనూ మనోళ్లది వెనుకంజే. కానీ మార్పు మొదలై కూడా చాలా ఏళ్లవుతోంది. అక్కడి పరిస్థితుల్లోనూ భారత్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటూ వస్తోంది. ఎన్నో చక్కని విజయాలనూ సాధించింది. క్రమంగా బలహీన పర్యటక జట్టన్న ముద్రను పోగొట్టుకుని.. ఉపఖండం ఆవల కూడా బలమైన ప్రత్యర్థిగా మారిపోయింది. అందుకు బలమైన రుజువే 2021. ఈ ఏడాది టీమ్‌ఇండియాకు గొప్ప మలుపు. చాలా ప్రత్యేకమైంది కూడా. బ్యాటర్లు రాణించినా.. ముఖ్యంగా పేసర్ల అదిరే ప్రదర్శనతో గబ్బా, సెంచూరియన్‌లో ఆతిథ్య జట్ల ఆధిపత్యానికి గండికొట్టింది. రెండూ పేస్‌కు బాగా అనుకూలించే పిచ్‌లే. రెండు చోట్లా ఆతిథ్య జట్లకు తిరుగులేని రికార్డుంది. కానీ రెండు చోట్లా భారత్.. తొలి సారి టెస్టు విజయాలనందుకుంది. నాణ్యమైన పేస్ ఆ జట్టు ప్రధానాస్త్రం.
గబ్బాలో మొదలై.. ప్రత్యర్థి విజయాలకు గండికొడుతూ!
IND vs SA Test: సెంచూరియన్ టెస్టులో తొలిసారి విజయ ఢంకా మోగించింది టీమ్ఇండియా. పేసర్లకు స్వర్గధామమైన ఈ పిచ్‌పై భారత్ పూర్తిగా ఆధిపత్యం వహించింది. ఇదే కాదు ఆస్ట్రేలియాలోని గబ్బాలోనూ చారిత్రక విజయం సాధించింది. దీనిని బట్టే చెప్పొచ్చు భారత జట్టు పేస్ విభాగంలో ఎంతగా రాటుదేలిందో.
గబ్బా అంటేనే పేసర్లకు స్వర్గధామం. పర్యటక జట్లకు అక్కడ అగ్ని పరీక్షే. 1988 నుంచి ఆస్ట్రేలియాకు అక్కడ ఓటమనేదే తెలియదు. భారత్ ఆరు టెస్టుల్లో ఒక్కటీ నెగ్గలేదు. ఐదు టెస్టుల్లో ఓడింది. అలాంటి చోట (చివరిదైన నాలుగో టెస్టు) ఈ ఏడాది ఆరంభంలో పేస్ దళ నాయకుడు బుమ్రా, షమీ లేకున్నా ఆస్ట్రేలియాను మట్టికరిపించి 2-1తో చారిత్రక టెస్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్న భారత్.. ఆ తర్వాత ఇంగ్లాండ్ (2-1) లోనూ పైచేయి సాధించింది. ఇప్పుడు సెంచూరియన్‌లో అదిరే ప్రదర్శనతో 2021ను ఘనంగా ముగించింది. అక్కడ విజయం చిన్న విషయం కాదు. గతంలో ఆ పిచ్‌పై ఆడిన మూడు టెస్టుల్లో భారీ పరాజయాల్ని చవిచూసింది భారత్. కానీ ఈసారి సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈసారీ పేస్ బౌలర్లే విజయ సారథులు. రెండు ఇన్నింగ్స్‌ల్లో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించిన పేస్ బౌలర్లు మ్యాచ్‌లో ఏకంగా 18 వికెట్లు పడగొట్టారు. టీమ్ ఇండియా ఇదే జోరును కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవాలన్న కలను నెరవేర్చుకుంటుందని, సిరీస్ విజయంతో కొత్త సంవత్సరాన్ని గొప్పగా ఆరంభిస్తుందని ఆశిద్దాం.