IND vs SA Test Series: దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న భారత జట్టుకి మరోసారి నిరాశే ఎదురైంది. సిరీస్ సాధించి చిరకాల విజయం అందుకోవాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం పాలైంది. ఆతిథ్య సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా విజయంలో కీగన్ పీటర్సన్, కెప్టెన్ డీన్ ఎల్గర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ కీలకంగా వ్యవహరించారు.
ఓవర్‌నైట్ స్కోరు 101/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మరో వికెట్ మాత్రమే నష్టపోయి కావాల్సిన పరుగులను సునాయాసంగా 212 రాబట్టింది. కీగన్ పీటర్సన్ (82) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. డీన్ ఎల్గర్ (30) పరుగులు చేసి ఔటయ్యాడు. వాండర్ డస్సెన్ (41*), తెంబా బవుమా (32*) మిగతా పని పూర్తి చేశారు. ఏ దశలోనూ భారత్ జట్టు వైపు గెలుపు త్రాసు తూగలేదు. భారత బౌలర్లలో బుమ్రా, మహమ్మద్ షమి, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.
భారత్ రెండో ఇన్నింగ్స్..
తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 13 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమ్‌ఇండియా 198 పరుగులకు ఆలౌటైంది. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (100*) శతకంతో రాణించినా.. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (29) ఫర్వాలేదనిపించినా.. కేఎల్ రాహుల్ (10), మయాంక్ అగర్వాల్ (7), ఛెతేశ్వర్ పుజారా (9), అజింక్య రహానె (1) విఫలమయ్యారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.