IND vs SA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్ ఉత్కంఠంగా మారుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (9*), పుజారా (14*) ఉన్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో జాన్‌సెన్, రబాడ చెరో వికెట్ తీశారు. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు చేసింది.
13 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌కు స్వల్ప వ్యవధిలో ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా ఓపెనర్లు కేఎల్ రాహుల్ (10), మయాంక్ అగర్వాల్ (7) ఔటయ్యారు. అయితే తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పుజారా, కోహ్లీ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రోజును ముగించారు. దీంతో భారత్ 70 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలిన ఉన్న నేపథ్యంలో ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశిస్తేనే సిరీస్ విజయం సాధించే అవకాశాలు టీమ్ఇండియాకు ఉంటాయి. కాగా, ఈ మ్యాచ్‌తో కోహ్లీ.. టెస్టుల్లో 100 క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో చేరాడు.