Ind vs Pak World Cup 2023 :2023 ప్రపంచకప్ అహ్మదాబాద్ వేదికగా జరిగిన భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో.. టీమ్ఇండియా ఫ్యాన్స్ ప్రవర్తన పట్ల పాక్ క్రికెట్ బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్షా 30 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న నరేంద్రమోదీ స్టేడియం.. మొత్తం టీమ్ఇండియా ఫ్యాన్స్‌తో నిండిపోయింది. వారంతా మ్యాచ్ మొదలైనప్పటి నుంచి అరుస్తూ.. పాక్ ప్లేయర్లను ఒత్తిడిలోకి నెట్టారని పీసీబీ ఆరోపిస్తోంది. ఈ విషయంపై పీసీబీ.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది ? టాస్ సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడేటప్పుడు.. మైదానంలోని ఆడియోన్స్ గట్టిగా అరిచారు. ఇక మ్యాచ్ జరుగుతుండగా.. 33.6 ఓవర్ల వద్ద పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో.. పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఔటయ్యాడు. దీంతో అతడు క్రీజును వీడి, డ్రెసింగ్ రూమ్ వైపు వెళ్తుండగా.. స్టేడియంలోని ఫ్యాన్స్ మతపరమైన స్లోగన్స్ ఇచ్చారు. అయితే ఇందంతా పాక్ క్రికెట్ బోర్డుకు నచ్చకపోవడం వల్ల ఐసీసీకు కంప్లైంట్ చేయాలని నిర్ణయించుకుందట. ఈ విషయంపై పీసీబీ చీఫ్ జాకా అష్రఫ్.. సోమవారం లాహోర్ చేరుకున్నాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఇంగ్లీష్ మీడియా కథనాల్లో పేర్కొంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజామ్ (50), రిజ్వాన్ (49) మాత్రమే రాణించారు. ఇక బుమ్రా, సిరాజ్, పాండ్య, కుల్దీప్, జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం టీమ్ఇండియా 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు ఛేదించింది. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (86), శ్రేయస్ అయ్యర్ (53*) అర్ధ శతకాలతో రాణించారు.