VVS Laxman Hardik Pandya: న్యూజిలాండ్ పర్యటనలో టీమ్ఇండియా చీఫ్ కోచ్‌గా నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్య టీమ్ఇండియాకు నాయకత్వం వహిస్తుండగా.. శిఖర్ ధావన్ వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వెల్లింగ్టన్‌లో మొదటి టీ20 సందర్భంగా లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో టీమ్ఇండియా ప్రాక్టీస్‌తోపాటు ముందున్న సవాళ్ల గురించి మాట్లాడాడు.
'అతడు ఒక గొప్ప లీడర్'.. పాండ్య కెప్టెన్సీపై VVS లక్ష్మణ్ కామెంట్స్ - భారత్ న్యూజిలాండ్ కోచ్
హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై న్యూజిలాండ్ పర్యటనలో టీమ్ఇండియా చీఫ్ కోచ్‌గా వ్యవహరించనున్న వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు గొప్ప లీడర్ అంటూ కొనియాడాడు. ఇంకేమన్నాడంటే?
భారత క్రికెటర్లు అద్భుతంగా ఆడుతున్నారని, అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. ఇక్కడ మనకు చాలా మంది ఆటగాళ్లు ఉన్నారన్నారు. టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఆయన.. నిర్దిష్ట ఆటగాళ్లకు అప్పుడప్పుడు విరామం ఇవ్వాలని పేర్కొన్నారు. ఆటగాళ్లు శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా పునరుత్తేజం పొందేందుకు విరామాలు చాలా ముఖ్యమన్నారు. వైట్-బాల్ క్రికెట్‌లో స్పెషలిస్ట్ ప్లేయర్‌లు అవసరమని ఆయన తెలిపారు.
అనంతరం తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ గురించి మాట్లాడాడు. "అతను అద్భుతమైన నాయకుడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఏమి చేశాడో చూశాము. టోర్నమెంట్‌లో ఫ్రాంచైజీకి మొదటి సంవత్సరంలో నాయకత్వం వహించడంతో పాటు లీగ్‌ను కూడా గెలిచాడు. ఐర్లాండ్ సిరీస్ నుంచి నేను అతడితో చాలా సమయం గడిపాను, అతడు వ్యూహాత్మకంగా మాత్రమే కాదు.. మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. అత్యున్నత స్థాయిలో ఇది చాలా ముఖ్యమైన విషయం. డ్రెస్సింగ్ రూమ్‌లో, పనిలో అతడు కనబర్చే తీరు ఆదర్శప్రాయంగా ఉంటుంది. మైదానంలో కానీ బయట కానీ హార్దిక్ కనబర్చే తీరు అద్భుతం. జట్టులోని ఆటగాళ్లు అందరూ అతడిని నమ్ముతారు" అంటూ లక్ష్మణ్ వెల్లడించాడు. ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉన్నా హార్దిక్ ప్రశాంతంగానే ఉంటాడని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు.