Ind vs Ned World Cup 2023 :2023 ప్రపంచకప్ టోర్నీలో భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ పండగలా సాగింది. క్రికెట్ అభిమానులకు అసలైన దీపావళిని పంచింది. బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల తేడాతో నెగ్గింది. 411 పరుగుల లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్.. 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. డచ్ జట్టు బ్యాటర్లలో తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు (54; 39 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఎంగెల్‌బ్రెచ్ట్ (45; 80 బంతుల్లో 4 ఫోర్లు), కోలిన్ అకెర్మాన్ (35; 32 బంతుల్లో 6 ఫోర్లు), మాక్స్ ఔడౌడ్ (30; 42 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా.. ఫలితం దక్కలేదు. భారత బౌలర్లలో బూమ్రా, సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, జడేజా తలో రెండు వికెట్లు తీయగా, కోహ్లీ, రోహిత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. సూపర్ సెంచరీచో అదరగొట్టిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 50 ఓవర్లలో 410 పరుగులు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారిస్తూ.. టీమ్ఇండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (51 పరుగులు), కెప్టెన్ రోహిత్ శర్మ (61 పరుగులు), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్ (128*), కేఎల్ రాహుల్ (102) సెంచరీలతో రెచ్చిపోయారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 208 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
ఈ మ్యాచ్‌లో మరిన్ని విశేషాలు
- ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్.. తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించాడు. జట్టులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా అందరూ బౌలింగ్ చేశారు.
- ఓ క్యాలెండర్ ఇయర్లో వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా టీమ్ఇండియా (215*) రికార్డు కొట్టింది. ఈ రికార్డు ఇదివరకు వెస్టిండీస్ (209 సిక్స్‌లు, 2019) పేరిట ఉంది.
- ఈ వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా.. ఇప్పటివరకు 16 వికెట్లు తీశాడు. భారత్ తరఫున ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ జడేజానే.
- ఈ సంవత్సరం భారత్.. వన్డేల్లో 24 విజయాలు నమోదు చేసింది. ఓ క్యాలెండర్ ఇయర్లో భారత్ ఇన్ని విజయాలు నమోదు చేయడం ఇది రెండోసారి. ఇదివరకు 1998లో కూడా టీమ్ఇండియా 24 మ్యాచ్‌ల్లో నెగ్గింది.
- తాజా గెలుపుతో భారత్.. వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. వరల్డ్‌కప్‌లో అందరికంటే ఎక్కువగా అస్ట్రేలియా రెండుసార్లు (2003, 2007) 11 మ్యాచ్‌ల్లో వరుసగా నెగ్గింది.