- ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా 2-1 ఆధిక్యం సాధించడమంటే అరుదైన విషయమే. అదే ఊపులో చివరి టెస్టు కూడా ఆడి ఉంటే సులువుగా సిరీస్ గెలిచేసేవారేమో!
- కానీ తొమ్మిది నెలల విరామం తర్వాత ఇప్పుడు ఆ మిగిలిన చివరి టెస్టు ఆడబోతుండగా.. రెండు జట్లలో ఎంతో వైరుధ్యం! ఫామ్ పరంగా కూడా చాలా తేడా! అంతా బేరీజు వేసుకుని చూస్తే ఈ మ్యాచ్‌లో భారత్‌కు కష్టమే అన్న అంచనాలు!
- అందుకు తగ్గట్లే మొదలైంది మ్యాచ్. మబ్బులు కమ్మిన వాతావరణంలో చెలరేగిన ఇంగ్లిష్ పేసర్ల ధాటికి ఒక దశలో భారత్ 98/5. ఈ స్కోరు చూస్తే మ్యాచ్ మీద ఆశలు పోయినట్లే అనిపించింది.
- కానీ ఇలాంటి సందర్భాల్లో ఆపద్బాంధవుడి పాత్ర పోషించడం అలవాటుగా చేసుకున్న రిషబ్ పంత్ వదిలితేనా..! రవీంద్ర జడేజా నుంచి చక్కటి సహకారం అందుకున్న ఈ మెరుపు వీరుడు భారత్‌ను మెరుగైన స్థితిలో నిలిపాడు. ఆట ఆఖరుకు స్కోరు 338/7.
ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌ను పేలవంగా ఆరంభించిన భారత్.. రిషబ్ పంత్ (146; 111 బంతుల్లో 19×4, 4×6) అద్భుత ఇన్నింగ్స్‌తో గొప్పగా పుంజుకుంది. తొలి రోజు ఆట ఆఖరుకు 73 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్; 163 బంతుల్లో 10×4)తో ఆరో వికెట్‌కు 222 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన పంత్ మ్యాచ్‌లో భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. అంతకుముందు జేమ్స్ అండర్సన్ (3/52), మాథ్యూ పాట్స్ (2/85) టీమ్ఇండియాను ఆరంభంలో గట్టి దెబ్బ తీశారు. అయిదు టెస్టుల సిరీస్‌లో నాలుగో మ్యాచ్ అయ్యేసరికి భారత్ 2-1తో ఆధిక్యంలో నిలవగా, కొవిడ్ కారణంగా వాయిదా పడ్డ అయిదో టెస్టునే భారత్ ఇప్పుడు ఆడుతున్న సంగతి తెలిసిందే.
అలా మొదలై..పేసర్లకు ఉత్సాహాన్నిచ్చేలా మబ్బులు కమ్మిన వాతావరణం.. ఇలాంటి స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అండర్సన్, బ్రాడ్, పాట్స్ లాంటి ఫామ్‌లో ఉన్న పేసర్లకు ఇంతకంటే ఏం కావాలి? ఈ అవకాశాన్ని వాళ్లు చక్కగా ఉపయోగించుకున్నారు. స్లిప్‌లో నలుగురు ఫీల్డర్లను పెట్టి.. ఆఫ్ స్టంప్ మీదే ఒకే లైన్లో బంతులు సంధిస్తూ భారత బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టారు. రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన పుజారా (13).. తనదైన శైలిలో పాతుకుపోయే ప్రయత్నం చేయగా, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (17) జాగ్రత్త వహిస్తూనే అప్పుడప్పుడూ షాట్లు ఆడాడు. అతను నాలుగు చూడముచ్చటైన బౌండరీలు కొట్టి సానుకూల దృక్పథంతో కనిపించాడు. కానీ గిల్ ఏకాగ్రత అరగంటే నిలిచింది. అండర్సన్ బౌలింగ్‌లో ఒక ఎడ్జ్‌తో త్రుటిలో ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న అతను.. ఇంకోసారి రెండో స్లిప్‌లో క్రాలీకి దొరికిపోయాడు. తర్వాత పుజారా, విహారి అత్యంత జాగ్రత్తతో బ్యాటింగ్ చేశారు.
డిఫెన్స్‌కే ప్రాధాన్యం.. పరుగుల కోసం చూడకుండా డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇస్తూ ఇంగ్లిష్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. అయితే సమీక్ష ద్వారా ఒక క్యాచ్ ఔట్‌ను తప్పించుకున్న పుజారా.. అండర్సన్ సంధించిన అద్భుతమైన ఔట్‌స్వింగర్‌ను ఆడక తప్పని స్థితిలో రెండో స్లిప్‌లో క్రాలీకే చిక్కాడు. ఈ దశలో వర్షం వల్ల రెండు గంటల పాటు ఆట ఆగిపోయింది. ఆట పునఃప్రారంభం కాగానే భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి. విహారి (20)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న పాట్స్.. కాసేపటికే ఫామ్‌లో లేని కోహ్లి (11)ని పెవిలియన్ చేర్చాడు. పాట్స్ బంతిని ఆడాలా వద్దా అన్నట్లు సంశయించిన కోహ్లి.. వికెట్ల మీదికి ఆడుకుని వెనుదిరిగాడు. ఉన్నకాసేపు చక్కటి షాట్లతో అలరించిన శ్రేయస్ (15).. లెగ్‌సైడ్ వెళ్తున్న అండర్సన్ బంతిని ఆడి బిల్లింగ్స్ ఒంటిచేత్తో పట్టిన క్యాచ్‌కు ఔటయ్యాడు. దీంతో 98/5కు చేరుకున్న భారత్.. 150 పరుగులైనా చేస్తుందా అనిపించింది ఆ దశలో.
తన ఆట తనదే.. 100 లోపు 5 వికెట్లు పడితే.. ఏ బ్యాట్స్‌మన్ అయినా ఆచితూచి ఆడతాడు. కానీ పంత్ ఇందుకు భిన్నం. ఎవరేమన్నా, విమర్శలు వచ్చినా తన ఆట తనదే. శుక్రవారం కూడా అతను అలాగే ఆడాడు. క్రీజులో కొంచెం కుదురుకోగానే షాట్లకు దిగాడు. అండర్సన్ లాంటి మేటి పేసర్ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్లు ఆడడం, రివర్స్ స్వీప్ చేయడం అతడికే చెల్లింది. ఇక స్పిన్నర్ లీచ్ (9-0-71-0) వస్తే అతడికి పండగన్నట్లే. తననో గల్లీ బౌలర్లా చూసిన పంత్.. టీ20ల తరహాలో అతడి బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. తన మార్కు ఒంటి చేతి సిక్సర్ కూడా బాదాడు రిషబ్. మరో ఎండ్‌లో జడేజా గొప్ప సహనంతో బ్యాటింగ్ చేస్తూ పంత్‌కు చక్కటి సహకారాన్నందించాడు. 5 పరుగుల వద్ద స్లిప్‌లో రూట్ కష్టమైన క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన జడేజా.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌కు అవకాశం ఇవ్వలేదు. పంత్ ఎక్కడా తగ్గకుండా పరుగుల వరద పారిస్తుంటే.. జడేజా అప్పుడప్పుడూ షాట్లు అందుకున్నాడు. దీంతో భారత్ రన్‌రేట్ 4 పైనే సాగింది. ఒక దశలో 5కు చేరువైంది కూడా. సెంచరీ ముంగిట కూడా పంత్ నెమ్మదించలేదు. 51 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన అతను.. 89 బంతులకే 100 అందుకున్నాడు. ఆ మార్కును దాటాక అతను టీ20 ఆటే ఆడాడు. 21 బంతుల్లోనే 146 మీదికి వచ్చేశాడు. అదే ఊపులో రూట్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన పంత్.. ఎడ్జ్‌తో స్లిప్‌లో క్రాలీ చేతికి చిక్కాడు. కాసేపటికే శార్దూల్ (1)ను స్టోక్స్ ఔట్ చేశాడు. తర్వాత షమి (0)తో కలిసి జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్..శుభ్‌మన్ గిల్ (సి) క్రాలీ (బి) అండర్సన్ 17; పుజారా (సి) క్రాలీ (బి) అండర్సన్ 13; విహారి ఎల్బీ (బి) పాట్స్ 20; కోహ్లి (బి) పాట్స్ 11; పంత్ (సి) క్రాలీ (బి) రూట్ 146; శ్రేయస్ అయ్యర్ (సి) బిల్లింగ్స్ (బి) అండర్సన్ 15; జడేజా బ్యాటింగ్ 83; శార్దూల్ (సి) బిల్లింగ్స్ (బి) స్టోక్స్ 1; షమి బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు 32; మొత్తం: (73 ఓవర్లలో 7 వికెట్లకు) 338; వికెట్ల పతనం: 1-27, 2-46, 3-64, 4-71, 5-98, 6-320, 7-323; బౌలింగ్: అండర్సన్ 19-4-52-3; బ్రాడ్ 15-2-53-0; పాట్స్ 17-1-85-2; లీచ్ 9-0-71-0; స్టోక్స్ 10-0-34-1; రూట్ 3-0-23-1