Ind Vs Aus First ODI 2023 : స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమ్‌ఇండియా అసలైన సవాల్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో శుక్రవారం తొలి వన్డే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కుల్‌దీప్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యలకు తొలి రెండు వన్డేల్లో విశ్రాంతినిచ్చింది మేనేజ్మెంట్. వీరంతా మూడో వన్డేలో ఆడనున్నారు.
తుది జట్లు ఇవే
భారత్:శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.
ఆస్ట్రేలియా:డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లీస్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, పాట్ కమిన్స్(కెప్టెన్), సీన్ అబాట్, అడమ్ జంపా.
అందుకే బౌలింగ్..
మొహాలీలో గల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో లక్ష్య ఛేదనకు దిగిన జట్లే.. మెజారిటీ విజయాలు సాధించిన నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. ప్రపంచంలోని మేటి జట్టైన ఆసీస్‌తో పోరు సవాలుతో కూడుకున్నదని.. అయితే ఛాలెంజ్‌లు స్వీకరించడం తమకు ఇష్టమేనని పేర్కొన్నాడు. గాయం కారణంగా ఆసియా కప్-2023 మ్యాచ్‌లకు దూరమైన శ్రేయస్ అయ్యర్ తుది జట్టులోకి వచ్చాడన్న రాహుల్.. ఏడాదిన్నర తర్వాత వన్డే జట్టుకు ఎంపికైన రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు.
వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి ముందు ఇరు జట్లకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఇప్పటికే ఆసియా వన్డే కప్-2023 గెలిచి జోరు మీదున్న టీమ్‌ఇండియా ఆసీస్‌తో సిరీస్‌నూ గెలిచి రెట్టించిన ఉత్సాహంతో ఐసీసీ ఈవెంట్‌లో అడుగుపెట్టాలని భావిస్తోంది. మరోవైపు.. సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన కంగారూలు భారత గడ్డపై సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు.
పిచ్ ఇలా..
మొహాలీలో నాలుగేళ్లుగా వన్డే మ్యాచ్ జరగలేదు. ఐపీఎల్‌లో మాత్రం కొన్ని భారీ స్కోర్లు నమోదయ్యాయి. చివరగా ఇక్కడ 2019లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తొలి వన్డే సందర్భంగా ఇక్కడి వాతావరణం వేడిగా, పొడిగా ఉంటుంది.