Ind vs Aus 3rd T20 :ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. మంగళవారం గువాహటి వేదికగా భారత్.. ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. తొలి రెండు టీ20ల్లో నెగ్గి ఊపుమీదున్న టీమ్ఇండియా.. మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ పట్టేయాలని భావిస్తోంది. ప్రపంచకప్ గెలిచిన జట్టుగా.. ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి సిరీస్‌లో బోణీ కొట్టాలని ఆసీస్ ఆశిస్తోంది.
ఆత్మవిశ్వాసంతో బరిలోకి :సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో పూర్తి ఆత్మ విశ్వాసంతో టీమ్ఇండియా బరిలోకి దిగుతోంది. టాపార్డర్ యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ అద్భతమైన ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో ఈ ముగ్గురూ 50+ స్కోర్లు చేసి.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించారు. ఇక కెప్టెన్ సూర్య, లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వర్మ మిడిలార్డర్లో, చివర్లో రింకు సింగ్ రాణిస్తే.. టీమ్ఇండియా ముచ్చటగా మూడోసారి 200+ స్కోర్ నమోదు చేస్తుందనడంలో సందేహం లేదు.
బౌలింగ్ గుబులు..తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినప్పటికీ.. టీమ్ఇండియా బౌలింగ్ కాస్త కలవరపెడుతోంది. మొదటి టీ20లో 200+ పై పరుగులివ్వగా.. రెండో మ్యాచ్‌లో 191 పరుగులు సమర్పించుకున్నారు టీమ్ఇండియా బౌలర్లు. అయితే టార్గెట్ పెద్దది కావడం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఒకవేళ భారత్ 200 లోపు స్కోర్ చేస్తే.. బౌలర్లకు అసలు సవాల్ ఎదురుకానుంది. ప్రసిద్ధ్ కృష్ణ గత మ్యాచ్‌లో 3 వికెట్లు తీసినా.. 10.20 ఎకనమీతో, అర్షదీప్ 11.50 , ముకేశ్ కుమార్ 10.80 ఎకనమీతో పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లోనైనా బౌలర్లు పుంజుకొని ఆసీస్ బ్యాటర్లకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఆసీస్ బోణీ కొట్టేనా.. వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డీలాపడిన ఆసీస్ ఈ సిరీస్‌ను ప్రతష్ఠాత్మకంగా తీసుకునే ఛాన్స్ ఉంది. స్టాయినిస్, టిమ్ డేవిడ్, మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్‌తో బ్యాటింగ్ బలంగా ఉంది. కానీ, బౌలింగ్ మెరుగుర్చుకుంటేనే తప్ప టీమ్ఇండియా జోరుకు బ్రేకులు వేయలేరు.