టీమ్ఇండియా ఆటగాడు పృథ్వీ షా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంత ఆడినా జట్టులోకి తీసుకోవడం లేదని వాపోయాడు. అయితే రెండేళ్ల క్రితం టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పృథ్వీ షా.. గత ఏడాది జూలైలో శ్రీలంకపై చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. తరచుగా గాయాల బారిన పడటం, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా పృథ్వీ షా టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడాతో పాటు పలువురు యంగ్ క్రికెటర్స్ రాణించడంతో టీమ్ఇండియాలో స్థానం కోసం గట్టి పోటీ ఏర్పడటం కూడా పృథ్వీషాకు ఇబ్బందికరంగా మారింది.
అయితే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో అతడిని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా పృథ్వీషాను ఎంపిక చేయలేదు. ఈ ఏడాది జరిగిన రంజీ ట్రోఫీలో పృథ్వీషా మంచి ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్ ఏ జట్టుతో జరిగిన అనధికారిక సిరీస్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు షా. అయినా తనను సెలెక్టర్లు పక్కనపెట్టడం నిరాశను కలిగించిందని పృథ్వీషా అన్నాడు.
ఆటగాడిగా హార్డ్ వర్క్ చేస్తున్న అవకాశాలు మాత్రం దక్కడం లేదని వాపోయాడు. బ్యాటర్లు పరుగులు చేయడం ముఖ్యమని, ఆ విషయంలో తాను ప్రతీసారి నిరూపించుకుంటూనే ఉన్నానని.. అయినా తనను పక్కనపెడుతున్నారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సెలెక్లర్లకు తనపై నమ్మకం కలిగిన రోజే అవకాశం ఇస్తారన్నది అర్థమవుతోందని.. అప్పటివరకు శ్రమిస్తూనే ఉంటానని పృథ్వీ షా అన్నాడు.