టీమ్ఇండియా ఆటగాడు మనీశ్ పాండేకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలని అతడి చిన్ననాటి కోచ్ ఇర్ఫాన్ సెయిత్ అన్నారు. అతడు పరిణతి చెందిన ఆటగాడని పేర్కొన్నారు. నిజాయతీగా ఇవ్వాల్సినన్ని అవకాశాలిస్తే గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీలంక పర్యటనకు మనీశ్ ఎంపికైన సందర్భంగా ఆయన మాట్లాడారు.
"మనీశ్ పాండే గట్టి పోటీదారు. అతడు సవాళ్లను ఇష్టపడతాడు. ఎన్ని ఎక్కువ సవాళ్లుంటే అతడంత తెలివిగా, మెరుగ్గా ఆడతాడు. అతడికి తగినన్ని అవకాశాలు ఇచ్చుంటే.. సెలక్టర్లు దృష్టి మళ్లకుండా చూసుకొనేవాడు. ఇప్పటికైనా ఇస్తే తనలోని ప్రతిభను ప్రదర్శించగలడు. అతడు అదరగొడతాడన్న నమ్మకం నాకుంది."
-ఇర్ఫాన్ సెయిత్, కోచ్.
"ముందు మనం మనీశ్ పట్ల పారదర్శకతతో ఉండాలి. అతడు ఆడిన మ్యాచుల కన్నా రిజర్వు బెంచీపైనే ఎక్కువగా ఉన్నాడు. ఏదో ఒక స్థానంలో కచ్చితంగా ఆడే అవకాశం ఇవ్వలేదు. అతడికి స్వేచ్ఛనిచ్చి ఉంటే టీమ్‌ఇండియాలో గొప్ప ఆటగాడిగా ఎదిగేవాడు. అతడిని కొన్నిసార్లు దురదృష్టం వెంటాడింది. ఎందుకంటే పరుగులు చేసేందుకు అతనెప్పుడూ సరైన బ్యాటింగ్ ఆర్డర్లో రాలేదు. పూర్తి సిరీసుకు అవకాశమిస్తే అతనేంటో నిరూపించుకుంటాడు. అతడు బ్యాటింగ్ మాత్రమే కాదు గొప్పగా ఫీల్డింగ్ చేయగలడు" అని సెయిత్ వెల్లడించారు. మరి శ్రీలంక పర్యటనలో మనీశ్ ఏం చేస్తాడో చూడాలి.
ఇదీ చదవండి:అంపైర్‌తో షకిబుల్ వాగ్వాదం.. వీడియో వైరల్