Ind Vs Eng World Cup 2023 : 2023 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా అద్భుత విజయం సాధించి నాకౌట్ బెర్తును ఖారారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 229 పరుగులు చేయగా.. ఛేదనలో ఇంగ్లాండ్ 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఏ ఒక్కరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. లివింగ్‌స్టోన్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జానీ బెయిర్‌స్టో (14), డేవిడ్ మలన్ (16) పరుగులు చేయగా.. జో రూట్ (0), బెన్‌స్టోక్స్ (0) డౌకౌట్ అయ్యారు. వీరే కాకుండా జోస్ బట్లర్ (10), మొయిన్ అలీ (15), క్రిస్‌వోక్స్ (10) తక్కువ పరుగులకో వరుసగా పెవిలియన్‌కు చేరారు. భారత బౌలర్లలో షమి (4/22), బుమ్రా (3/32), కుల్‌దీప్ యాదవ్ (2/24) ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో భారత్.. పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అటు ఇంగ్లాండ్ 2 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉంది.
రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్‌లో శుభ్‌మన్ గిల్ (9), విరాట్ కోహ్లీ (0), శ్రేయస్ అయ్యర్ (4) విఫలమయ్యారు. కానీ రోహిత్ శర్మ (87; 101 బంతుల్లో 10x4, 3x6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి కాస్తలో సెంచరీ మిస్అయ్యాడు. మరో బ్యాటర్ కేఎల్ రాహుల్ (39; 58 బంతుల్లో 3x4) రాణించాడు. రవీంద్ర జడేజా (8) విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (49; 47 బంతుల్లో 4x4, 1x6) త్రుటిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు.