India Vs Pakistan World Cup : భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి క్రికెట్ వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. దేశంలో వివిధ వేదికల్లో జరగనున్న ఈ పోరుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. వరల్డ్ కప్ అంటేనే టీవీలకు అతుక్కుపోయే క్రికెట్ లవర్స్ ఇక చిరకాల భారత్-పాక్ మ్యాచ్ అంటే చాలు కళ్లార్పకుండా చూస్తారు. దాయాదుల పోరు అంత రసవత్తరంగా ఉంటుంది. ఈ క్రమంలో అక్టోబర్ 15న భారత్-పాకిస్థాన్ తొలిసారి పోటీపడనుంది. ఇక ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా చూసేందుకు సర్వం సిద్ధం అవుతున్న వేళ క్రికెట్ లవర్స్‌కు ఐసీసీ ఓ పెద్ద షాక్ ఇవ్వనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఆ తేదీ ఖారారు ?
ఇటీవలే ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. అయితే అదే రోజు గుజరాత్ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐకి సూచించినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారులు చెప్పినట్లు తెలిపింది.