ICC World Cup 2022 Mithali Raj: తన భవిష్యత్తు గురించి ఇంకా ఆలోచించలేదని చెప్పింది భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్. ప్రపంచకప్ నుంచి భారత్ నిష్క్రమణ బాధిస్తున్న వేళ భవిష్యత్తు గురించి నిర్ణయానికి సరైన సమయం కాదని చెప్పింది. "మ్యాచ్ తర్వాత నా భవిష్యత్తు గురించి ఆలోచించడానికి సమయం దొరకలేదు. ప్రపంచకప్‌లో ఇలాంటి నిరాశపూరిత నిష్క్రమణను అంగీకరించి ముందుకెళ్లడానికి సమయం పడుతుంది. మిగతా క్రీడాకారుల భవిష్యత్తు ఎలా ఉంటుందో కానీ నా గురించి ఆలోచించలేదు. ప్రస్తుత భావోద్వేగ పరిస్థితుల్లో నా భవిష్యత్తుపై వ్యాఖ్యానించడం సరికాదు" అని మిథాలీ చెప్పింది.
పోరాడి ఓడింది:ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు పోరాటం ముగిసింది. సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ రాజ్ సేనకు చుక్కెదురైంది. ఆదివారం నరాలు తెగే ఉత్కంఠభరిత పోరులో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఆఖరి బంతికి ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు అసమానంగా పోరాడినా ఫలితం దక్కలేదు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగుల భారీస్కోరు సాధించింది. స్మృతి మంధాన (71; 84 బంతుల్లో 6×4, 1×6), షెఫాలీవర్మ (53; 46 బంతుల్లో 8×4), మిథాలీ (68; 84 బంతుల్లో 8×4), హర్మన్‌ప్రీత్ (48; 57 బంతుల్లో 4×4) అద్భుతంగా రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. లారా వోల్వార్ట్ (80; 79 బంతుల్లో 11×4), లారా గుడ్‌ఆల్ (49; 69 బంతుల్లో 4×4), 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' డుప్రీజ్ (52 నాటౌట్; 63 బంతుల్లో 2×4) సత్తాచాటారు. స్పిన్నర్లు రాజేశ్వరి గైక్వాడ్ (2/61), హర్మన్‌ప్రీత్ (2/42) రాణించినా.. మిగతా బౌలర్లు వికెట్లు పడగొట్టలేకపోవడం భారత్‌ను దెబ్బతీసింది.
ఏడు మ్యాచ్‌ల్లో మూడింట్లో నెగ్గి.. నాల్గింట్లో ఓడిన భారత్ మొత్తం 6 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. పట్టికలో తొలి 4 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా (14 పాయింట్లు), దక్షిణాఫ్రికా (11), ఇంగ్లాండ్ (8), వెస్టిండీస్ (7) సెమీస్ చేరుకున్నాయి. నాకౌట్ విండీస్‌తో ఆసీస్, దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్ తలపడనున్నాయి.
ఇదీ చదవండి:Ind vs SA: టీమ్ఇండియాకు నిరాశ.. ప్రపంచకప్ ఆశలు గల్లంతు