ICC Formats Centuries : లండన్‌లోని ఓవెల్ స్టేడియం వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్.. సెంచరీ బాదేసి కొత్త రికార్డు సృష్టించారు. 29 ఏళ్ల ఈ కంగారూ ఆటగాడు.. డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అయితే ప్రస్తుతం నెట్టింట హెడ్ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పటి వరకు వివిధ ఫార్మాట్లలో జరిగిన ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్స్‌లో ఎవరెవరు శతకాలు బాదారన్న విషయంపై నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
- అయితే 1975లో ఐసీసీ వన్డే వరల్ట్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు చెందిన క్లైవ్ లాయిడ్.. సెంచరీ సాధించాడు. దీంతో వన్డే ఫార్మాట్లోని ఫైనల్ మ్యాచ్‌లో తొలి సెంచరీ బాదిన ఘనతను అందుకున్నాడు.
- 1998లో సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తొలి సెంచరీని విండీస్ ప్లేయర్ ఫిలో వాలెస్ నమోదు చేశాడు.
- టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో ఇప్పటివరకు ఎవరూ సెంచరీ కొట్టలేదు.
WTC Final 2023 : ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆసీస్‌దేపై చేయిగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ సెంచరీ సాధించాడు. స్టీవ్ స్మిత్ 95 స్కోర్‌తో శతకానికి చేరువయ్యాడు. ఇక ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 43 స్కోర్ చేసి దూకుడుగా ఆడాడు. మార్నస్ లబుషేన్ 26 పరుగులు సాధించాడు. మరోవైపు టీమ్‌ఇండియా బౌలర్లలో మహ్మద్ షమి, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆరంభంలో చకచకా వికెట్లు పడగొట్టి ఆశలు రేకెత్తించిన టీమ్ఇండియా బౌలర్లు..ఆ తర్వాత జోరును కొనసాగించలేక చేతులెత్తేశారు. పచ్చిక పిచ్‌పై, అనుకూల పరిస్థితుల్లో భారత పేసర్ల దాడికి 76/3తో కష్టాల్లో పడ్డట్లు కనిపించిన ఆసిస్ జట్టు.. మధ్యాహ్నం నుంచి పిచ్ పరిస్థితులు మారడం వల్ల చెలరేగిపోయింది. ఇంగ్లాండ్ 'బజ్‌బాల్' ఆటను గుర్తు చేస్తూ.. వన్డే క్రికెట్ ఆడుతున్నట్లుగా చెలరేగిపోయాడు ట్రావిస్ హెడ్. భారత్ జోరుకు తన బ్యాట్‌తో బ్రేకులేశాడు. ఇక స్టీవ్ స్మిత్ కూడా ఎప్పట్లాగే క్రీజులో పాతుకుపోవడం వల్ల ఈ తుదిపోరు తొలి రోజు ముగిసేసరికి ఆస్ట్రేలియా లీడ్‌లో ఉంది.