చరిత్ర చూస్తే ఉపఖండేతర జట్లన్నింటికీ స్పిన్ ఆడడంలో సమస్య ఉన్న మాట వాస్తవం. ఆస్ట్రేలియా కూడా అందుకు మినహాయింపు కాదు. చాలా ఏళ్ల నుంచి ఆ జట్టు బ్యాటర్లు భారత పర్యటనలో స్పిన్నర్లను ఆడలేక తడబడుతున్నారు. స్పిన్ ఆయుధంతోనే కంగారూలను దెబ్బ తీసి సిరీస్‌లను సొంతం చేసుకుంటోంది భారత్. ఈసారి కూడా అదే మంత్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. అయితే ఈసారి ప్రత్యర్థి ప్రణాళికాబద్ధంగానే సిరీస్‌కు సిద్ధమతున్నట్లు కనిపిస్తోంది. అసలు మ్యాచ్‌లకు భిన్నంగా పచ్చిక పిచ్ ఇచ్చి తమ సన్నద్ధతను దెబ్బ తీస్తారనే ఉద్దేశంతో అసలు వార్మప్ మ్యాచే వద్దనుకుంది. దాని బదులు నెట్ సెషన్లలో స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ఆ జట్టు బ్యాటర్లు ముమ్మర సాధన చేస్తున్నారు. తమ జట్టులోని స్పిన్నర్లకు తోడు నెట్ బౌలర్లుగా భారత దేశవాళీ స్పిన్నర్ల సేవలను ఉపయోగించుకుంటున్నారు.
సిరీస్‌లో తమకు ప్రధాన ముప్పు అవుతాడని భావిస్తున్న అశ్విన్ లాగే బంతులేసే మహీష పితియా అనే యువ స్పిన్నర్ బౌలింగ్‌లో సాధన సాగిస్తున్న విషయం కూడా వెల్లడైంది. ఇక ఆ జట్టు గతంతో పోలిస్తే స్పిన్ ఆడడంలో మెరుగైన మాట కూడా వాస్తవం. స్టీవ్ స్మిత్ ముందు నుంచి స్పిన్నర్లను ఆడడంలో దిట్ట. భారత్‌లో అతడికి మంచి రికార్డుంది కూడా. మంచి ఫామ్‌లో ఉన్న ఉస్మాన్ ఖవాజా, లబుషేన్ కూడా స్పిన్‌ను బాగానే ఆడతారు. ఈసారి తమ ప్రదర్శనతో పాటు ఫలితాన్ని కూడా మార్చాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా ఆస్ట్రేలియన్ల మాటలు, సన్నాహాల్ని బట్టి స్పష్టమవుతోంది.
మనోళ్లు సిద్ధమా?:
ఆస్ట్రేలియన్లు భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారన్నది పక్కన పెడితే.. బంతి విపరీతంగా తిరిగితే మన బ్యాటర్లు ప్రత్యర్థి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోగలరా అన్నది ప్రశ్న. ఇప్పుడు భారత ప్రధాన బ్యాటర్లు ఎవరూ ఉత్తమ ఫామ్‌లో లేరు. కోహ్లి, రోహిత్, పుజారా, రాహుల్ నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నారు. మిగతా బ్యాటర్లకు అంత అనుభవం లేదు. బంతి బాగా తిరిగే పిచ్‌పై నాణ్యమైన స్పిన్నర్లు ఎదురైతే మన బ్యాటర్లు కూడా తడబడుతున్న సందర్భాలు చూస్తున్నాం.