Heinrich Klaasen Century :దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో పరుగుల వరద పారుతోంది. తాజాగా జరిగిన నాలుగో వన్డేలో ఏకంగా 416/5 స్కోరు సాధించిన సౌతాఫ్రికా.. కంగారు జట్టును 146 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో భాగమైన సౌతాఫ్రికన్ ప్లేయర్ హెన్రీచ్ క్లాసెన్.. విధ్వంసకరంగా ఆడి కంగారు బౌలర్లకు చుక్కలు చూపించాడు. 83 బంతుల్లోనే 13 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 174 పరుగులు చేసి తన స్కోర్‌తో జట్టును విజయ పథంలో నడిపించాడు. దీంతో సిరీస్ 2-2 గా సమమైంది.
SA VS AUS 4th ODI : ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాలో క్వింటన్ డి కాక్(45), రీజా హెండ్రిక్స్(28) మంచి శుభారంభం చేశారు. ఆ తర్వాత మూడో నెంబర్‌లో వచ్చిన వాన్‌డెర్ డసన్ కూడా 62 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కెప్టెన్ మార్క్రమ్ మాత్రం 8 పరుగులకే అనూహ్యంగా వెనుదిరిగాడు.
అలా 25.1 ఓవర్లకే 3 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాకు.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్ అండగా నిలిచాడు. తొలుత నెమ్మదిగా ఆడినప్పటికీ.. ఆ తర్వాత 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (53).. 58 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇంతటితో ఆగని క్లాసెన్.. ఆ తర్వాతి 26 బంతుల్లోనే వరుస ఫోర్లు, సిక్సర్లతో 74 పరుగులు తన ఖాతాలోకి వేసుకున్నాడు. అయితే మార్కస్ స్టోయినీస్ వేసిన చివరి ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి నాథన్ ఎల్లిస్ చేతికి చిక్కాడు. 174 పరుగుల చేసి పెవిలియన్ బాట పట్టాడు.