తెలంగాణ

telangana

ETV Bharat / sports

నేడే ​ఇండియా-ఆస్ట్రేలియా రెండో టీ20 టికెట్‌ విక్రయాలు - టీమ్​ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ స్టేడియం

IND VS AUS match tickets
ఆస్ట్రేలియా టీమ్​ఇండియా రెండో టీ20

By

Published : Sep 21, 2022, 10:43 PM IST

Updated : Sep 22, 2022, 7:45 AM IST

22:40 September 21

మ్యాచ్‌ టికెట్‌ విక్రయాలు నేడే

టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల అమ్మకంపై గందరగోళం కొనసాగుతోంది. 'పేటీఎం' వేదికగా టిక్కెట్లు అమ్మినట్లు మొదట ప్రకటించిన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ).. అభిమానులు ఆందోళనకు దిగడంతో గురువారం టికెట్లు అమ్మనున్నట్లు తెలిపింది. 39,000 టికెట్లు ఏమయ్యాయి అంటూ బుధవారం క్రికెట్‌ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. జింఖానా మైదానంలో టికెట్ల అమ్మకం అంటూ సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు రావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా మైదానానికి పోటెత్తారు. ఉదయం 7 గంటలకే వేలాది సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే గేట్లు మూసి ఉండటం.. హెచ్‌సీఏ అధికారులెవరూ లేకపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గేట్లు దూకి లోపలికి ప్రవేశించారు. కొంతమంది మైదానంలోకి దూసుకెళ్లారు. అక్కడే బైఠాయించడంతో పరిస్థితి అదుపు తప్పింది. "హెచ్‌సీఏ డౌన్‌ డౌన్‌". "వెంటనే టిక్కెట్లు అమ్మాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు హెచ్‌సీఏ అధికారులతో మాట్లాడి.. గురువారం జింఖానా మైదానంలో టికెట్లు అమ్ముతారని హామీ ఇవ్వడంతో అభిమానులు అక్కడి నుంచి నిష్క్రమించారు.

అంతా అయోమయం
ఇన్నాళ్లూ పాలక వర్గంలో కుమ్ములాటలు, అవ్యవస్థ, యువ క్రికెటర్లకు అన్యాయం లాంటి వివాదాలతో హెచ్‌సీఏ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇప్పుడు లేక లేక ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం వస్తే.. దాన్ని కూడా వివాదాస్పదంగా మార్చడం హెచ్‌సీఏకే చెల్లింది. భారత్‌-ఆసీస్‌ టీ20 మ్యాచ్‌ టిక్కెట్ల అమ్మకంపై హెచ్‌సీఏలో మొదట్నుంచీ అయోమయమే కనిపిస్తోంది. ఎన్ని టిక్కెట్లు అమ్మకానికి పెట్టాలి? ఎన్ని కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వాలన్న విషయంలో స్పష్టత లోపించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తమకు సంబంధం లేదని.. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడంటూ ఎపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు చెప్తున్నారు. ఉప్పల్‌ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్‌ జరిగినా హెచ్‌సీఏలోని 216 క్లబ్‌లకు తలా 15 చొప్పున 3,240 పాసులు కేటాయిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ సంస్థల సిబ్బందితో పాటు ఇతరులకు కలిపి మొత్తం 9,000 పాసులుగా పరిగణించినా ఇంకా 30,000 టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని ఆన్‌లైన్‌తో పాటు జింఖానా మైదానం, ఇతర కౌంటర్ల ద్వారా అమ్మేవాళ్లు. అయితే ఈసారి టికెట్లన్నీ పూర్తిగా 'పేటీఎం'లోనే అమ్మకానికి పెట్టడం గందరగోళానికి దారితీసింది. ఈ నెల 15న రాత్రి 8 గంటలకు 'పేటీఎం'లో అమ్మకాలు మొదలవగా.. కొన్ని క్షణాల్లోనే టికెట్లు అయిపోయాయి. మొత్తం అమ్ముడైనట్లు హెచ్‌సీఏ వర్గాలు తెలిపినా.. సుమారు 15,000 మాత్రమే అందుబాటులో ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం.. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో మళ్లీ టికెట్లు అమ్ముతామంటూ 'పేటీఎం' ప్రకటించింది. అయితే మ్యాచ్‌ దగ్గర పడుతున్నా టికెట్లు విడుదల చేయకపోవడం అభిమానుల్ని నిరాశకు గురిచేస్తోంది. "టికెట్ల అమ్మకంలో గోల్‌మాల్‌ కనిపిస్తోంది. 9,000 కాంప్లిమెంటరీ పాసులు.. 15,000 టిక్కెట్ల రూపంలో అమ్మారనే అనుకుందాం. మరి మిగతా 15,000 టిక్కెట్లు ఎటు పోయినట్లు? లేదా ఆ టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతారా?" అంటూ హెచ్‌సీఏ క్లబ్‌ల కార్యదర్శులు విమర్శిస్తున్నారు. సుప్రీం కోర్టు నియమించిన హెచ్‌సీఏ పర్యవేక్షణ కమిటీ సభ్యులు ఐపీఎస్‌ అంజని కుమార్‌, మాజీ క్రికెటర్‌ వెంకటపతి రాజు ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

టికెట్ల అమ్మకం నేడు
ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరగబోయే భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ20 టికెట్ల అమ్మకం గురువారం చేపట్టనున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. టికెట్లు అందుబాటులో లేకపోవడంపై అభిమానులు బుధవారం జింఖానా మైదానం వద్ద ఆందోళన చేపట్టిన నేపథ్యంలో హెచ్‌సీఏ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమ్మకాలు కొనసాగుతాయని హెచ్‌సీఏ పేర్కొంది.

బ్లాక్‌లో అమ్మితే తీవ్ర పరిణామాలు
భారత్‌, ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌ టికెట్లను బ్లాక్‌లో విక్రయించినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయని తెలంగాణ క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చరించారు. ‘‘టీ20 మ్యాచ్‌ టికెట్ల అవకతవకలపై విచారణ జరిపిస్తాం. టికెట్లు బ్లాక్‌లో అమ్మినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయి. దీనిపై క్రీడా, పోలీస్‌ శాఖలు నిఘా ఉంచాయి. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం కేవలం పది మంది అనుభవించడం కోసం కాదు. క్రీడా శాఖ కార్యదర్శితో కలిసి నేడు ఉప్పల్‌ స్టేడియాన్ని పరిశీలిస్తా’’ అని మంత్రి పేర్కొన్నారు.

Last Updated : Sep 22, 2022, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details