Harmanpreet kaur vs bangladesh : బంగ్లాదేశ్ టూర్‌ను టీమ్ఇండియా మహిళ జట్టు 'టై'తో ముగించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్ టై అయ్యింది. సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్ల తీరుపై టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఔట్ విషయంలో అంపైర్లు తప్పుగా వ్యవహరించారని, వారి నిర్ణయం సరిగ్గా లేదని ఆరోపించింది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయి వికెట్లను బ్యాట్‌తో కూడా కొట్టింది. కోపంతో అంపైర్ వైపు సంజ్ఞలు చేస్తూ మైదానం వీడింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో.. భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో ఇది జరిగింది. బంగ్లా బౌలర్ నహిదా అక్తర్ సంధించిన మూడో బాల్‌ను లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది హర్మన్. అయితే బంతి బ్యాట్ ను తాకిందా లేదా ఆమె ప్యాడ్లను తాకిందా అనేది క్లారిటీ అవ్వలేదు. అదే సమయంలో బంగ్లాదేశ్ ప్లేయర్లు ఎల్బీ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. పైగా ఈ సిరీస్‌లో డీఆర్‌ఎస్ అందుబాటులో లేదు. దీంతో అంపైర్‌దే తుది నిర్ణయం. ఇక ఇలా జరగడంతో హర్మన్ కోపంతో ఊగిపోయింది. అంపైరింగ్ సరిగ్గా చేయలేవా? అంటూ అరుస్తూ క్రీజును వీడింది.
హర్మన్ వ్యంగ్యస్త్రాలు.. మ్యాచ్ అనంతరం కూడా అంపైర్ల తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. అంపైర్లు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి బంగ్లా పర్యటనకు వచ్చేటప్పుడు అంపైర్లకు అనుగుణంగా సిద్ధమై వస్తామంటూ వ్యంగ్యస్త్రాలు సంధించింది హర్మన్. అలాగే ఇండియన్ హై కమిషన్ అధికారులను స్టేజ్ మీదకి పిలవకుండా వెయిట్ చేయిస్తూ బంగ్లా బోర్డు అవమానించిందని పేర్కొంది. కాగా, మూడో వన్డే మైదానంలో అంపైర్లుగా ఉన్న కమ్రుజమాన్, తన్వీర్ బంగ్లాదేశ్‌కు చెందినవాళ్లే.