తెలంగాణ

telangana

ETV Bharat / sports

కష్టాలను ఎదురీది.. అండర్​-19 ప్రపంచకప్​ హీరోగా తెలుగు తేజం - అండర్​ 19 ప్రపంచకప్​ హీరో రషీద్​

Sheikh Rashid Under-19 Player: ఇదో తండ్రీకొడుకుల కథ. ఆ కొడుకుని సరదాకే క్రికెట్‌ నిచ్చెన ఎక్కించాడు ఆ తండ్రి. అతను చకచకా ఎక్కడం చూసి తన చేతుల్ని నిచ్చెన మెట్లుగా మలిచాడు. కొడుకు మరింత పైకి వెళ్లాలని ఉద్యోగాన్నీ వదులుకుని రోజుకూలీగా మారాడు. తన రక్తాన్నే చెమటగా చిందించి అతణ్ణి చక్కటి క్రికెటర్‌గా దేశానికి అందించాడు. ఆ కొడుకు ఇటీవల అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించిన జట్టులో అదరగొట్టిన తెలుగుకుర్రాడు షేక్‌ రషీద్‌. ఆ తండ్రి బాలీషావలి. ఆ ఇద్దరి ప్రయాణం ఇది...

sheikh rashid
షేక్​ రషీద్

By

Published : Feb 20, 2022, 9:48 AM IST

Sheikh Rashid Under-19 Player:2016 సెప్టెంబర్‌ 30. మంగళగిరిలోని ఆంధ్రా క్లికెట్‌ క్లబ్‌ శిక్షణ తరగతులకి ఆ రోజు నుంచి దసరా సెలవులు ప్రకటించారు. సెలవులిచ్చారుకదాని... విశ్రాంతి తీసుకోవాలనుకోలేదు ఆ తండ్రీకొడుకులు. దేశంలో దసరా సెలవుల్లేని క్రికెట్‌ క్లబ్‌లు ఏమేం ఉన్నాయో వెతకడం మొదలుపెట్టారు. చెన్నై క్రికెట్‌ క్లబ్‌కి సెలవులు లేవని తెలిసింది. అప్పటికప్పుడు గుంటూరు జంక్షన్‌ నుంచి చెన్నై రైలు ఎన్నిగంటలకో కనుక్కున్నారు. రాత్రి 9.00 గంటలకి ఆ రైలు... అప్పటికే సమయం ఆరు అవుతోంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంగళగిరి నుంచి బయల్దేరి గుంటూరులోని ఇంటికెళ్లారు. ఏదో తిన్నామనిపించి గుంటూరు రైల్వే జంక్షన్‌ వైపు పరుగులు పెట్టారు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీలో ఒక్క టాయిలెట్‌ దగ్గరే ఖాళీ కనిపించింది. ఆ తలుపు దగ్గర క్రికెట్‌ కిట్‌ ఉంచి దానిపైన చేరగిలపడ్డారు. అర్ధరాత్రి దాటినా అక్కడి దుర్గంధానికి నిద్రపట్టట్లేదు తండ్రి బాలీషాకి. కొడుకు రషీద్‌ వైపు చూశాడు. అతనూ నిద్రపోలేదు కానీ... ఇంకేదో లోకంలో ఉన్నట్టున్నాడు. కుడిచేతినే క్రికెట్‌బ్యాట్‌గా ఊహించుకుని... అక్కడ లేని బంతినీ వేయని బౌలింగ్‌నీ కల్పించుకుని... కవర్‌డ్రైవ్‌లూ అప్పర్‌కట్‌లూ ఆడేస్తున్నాడు! ఆ క్రికెట్‌ పిచ్చిని చూసి సంతృప్తే కాదు... సన్నగా దుఃఖమూ కలిగింది బాలీషాలో. పరస్పర విరుద్ధమైన ఆ ఉద్వేగాలకి కారణమేంటో తెలియాలంటే... ఎనిమిదేళ్లు వెనక్కి వెళ్లాలి.

ఆయనే గుర్తించారు...

ఉప్పల్‌ స్టేడియం... ఈ అంతర్జాతీయ క్రికెట్‌ వేదికని చూడాలన్నది బాలీషావలి ఎన్నో రోజుల కల. హైదరాబాద్‌లో అడుగు పెట్టీపెట్టగానే దాన్ని సాకారం చేసుకున్నాడు. స్టేడియానికి దగ్గర్లోనే ఉద్యోగం వచ్చిన రోజైతే ఎగిరి గంతేశాడు! అక్కడ రంజీ మ్యాచ్‌లు జరిగినా తనివితీరా ఆనందిస్తుండేవాడు. స్థానిక క్లబ్‌ల మ్యాచ్‌లూ, వాళ్ల ప్రాక్టీస్‌లనీ చూస్తూ ఉండేవాడు. ఏడెనిమిదేళ్లపాటు అలా తరచూ వస్తూపోతుండటం వల్ల స్టేడియం గ్రౌండ్‌మెన్‌తో పరిచయం ఏర్పడింది. వాళ్ల సాయంతో వేసవి సెలవుల్లో... తన ఇద్దరు కొడుకుల్ని అక్కడే ప్రాక్టీస్‌ చేయించేవాడు. పెద్దవాడు షేక్‌ రియాజ్‌... ఒకరోజు వస్తే నాలుగురోజులు డుమ్మా కొట్టేవాడు. చిన్నవాడు రషీద్‌ మాత్రం... తండ్రికన్నా ముందు సిద్ధమై కూర్చునేవాడు. తండ్రిలాగే సచిన్‌ తెందుల్కర్‌కి భక్తుడయ్యాడు. అలా రషీద్‌ని ప్రాక్టీస్‌కి తీసుకెళ్తుండగానే ఓసారి ఉప్పల్‌ స్టేడియంలో 'టాలెంట్‌ హంట్‌' పేరుతో 14 ఏళ్లు దాటినవాళ్లకి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. రషీద్‌కేమో అప్పటికి ఎనిమిదేళ్లే! అయినాసరే... స్టేడియంలోని తన ఫ్రెండ్స్‌ చేత సిఫార్సుచేయించి శిక్షణకి పంపించాడు. వారం గడిచింది. బాలీషావలి తన ఆఫీసుకొచ్చి పనిచేసుకుంటూ ఉండగా ఫోన్‌ వచ్చింది. 'రషీద్‌ మీ అబ్బాయేనా... ఓసారి రండి!' అన్నారు స్టేడియం నుంచి. అక్కడికి వెళితే... శిక్షణకి వచ్చిన మూడువందల పైచిలుకు పిల్లల నుంచి వేరుచేసి రషీద్‌ని ప్రత్యేకంగా నిలబెట్టారు కోచ్‌ ఛటర్జీ. బాలీషావలి వెళ్లగానే 'వీడు మీ అబ్బాయేనా? మంచి టాలెంట్‌ ఉంది... దాన్ని వేస్ట్‌ చేయకండి!' అని చెప్పాడాయన. రషీద్‌ విషయంలో బాలీషాకి సంతోషమూ... దుఃఖమూ ఒకేసారి కలిగిన తొలి సందర్భం అదే!

షేక్​ రషీద్

ఆర్థిక కారణాలే...

బాలీషాది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం గ్రామం. చిన్నప్పటి నుంచీ ఓ వైపు కూలీనాలీ చేస్తూనే బీసీ వసతిగృహంలో ఉంటూ డిగ్రీదాకా చదువుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ఆటోమొబైల్‌ కంపెనీలో సేల్స్‌ రిప్రజెంటేటివ్‌గా ఉద్యోగం రావడం వల్ల ఇటొచ్చాడు. గుంటూరులోని కోమటినేనివారిపాలెం గ్రామానికి చెందిన జ్యోతితో నిఖా అయింది. హైదరాబాద్‌ కొత్తపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌ పెంట్‌ హౌస్‌లో కాపురం ఉండేవారు. ఆ నేపథ్యంలోనే కోచ్‌ ఛటర్జీ రషీద్‌లోని ప్రతిభని తొలిసారి గుర్తించడం వల్ల.. ఆనందమే కాదు 'ట్రెయినింగూ ఇతర అవసరాలకు వేలాదిరూపాయలు ఖర్చుపెట్టి వీణ్ణి క్రికెటర్‌ని ఎలా చేస్తానా?' అన్న దుఃఖమూ కలిగింది. అయినా 'ఏదైతే అదవుతుంది!' అన్న మొండిధైర్యంతో ముందుకే వెళ్లాడు.. ఎలాగోలా మూడు నెలలు శిక్షణ ఇప్పించాడు. ఓసారి అక్కడికి క్రికెటర్‌ అర్జున్‌ యాదవ్‌ తన కోచ్‌ ఎస్‌ఎన్‌ గణేశ్‌తోపాటు వచ్చాడు. గణేశ్‌ దృష్టి అక్కడ ఆడుతున్న చిన్నారి రషీద్‌పైన పడింది. వాణ్ణి చూసి 'బాగానే ఆడుతున్నాడే!' అని ఆయన అంటే పక్కనే ఉన్న అర్జున్‌ యాదవ్‌ 'వీణ్ణి మన క్యాంపులో చేర్చుకుందాం!' అన్నాడట. అలా గణేశ్‌ దగ్గర చేరాక అప్పటికే ఆయన దగ్గర సాధన పొందుతున్న అంబటి రాయుడు, మిథాలీరాజ్‌ వంటి పేరున్న క్రీడాకారుల ఆటని దగ్గరగా గమనించగలిగాడు రషీద్‌. చక్కటి బ్యాటింగ్‌ నైపుణ్యాలు నేర్చుకోగలిగాడు. అదే ఏడాది గుంటూరు జిల్లాలో అండర్‌-14 ఎంపిక పోటీల్లో నెగ్గాడు. ఆ తర్వాత మూడు మ్యాచ్‌లుంటే రెండింటిలో అవకాశం ఇచ్చారు. ఆ రెండింటిలోనూ రషీద్‌ సరిగ్గా ఆడలేదు! ఆ వైఫల్యం తండ్రిలో నిరాశని పెంచితే... ఆ కుర్రాడిలో పట్టుదలని పెంచింది. ఆ నిరాశా పట్టుదలల సంఘర్షణలో దిగ్భ్రాంతికరమైన సంఘటనొకటి చోటుచేసుకుంది...

బొబ్బలెక్కిపోయాయి...

"అది తలచుకుని నన్ను నేను తిట్టుకోని క్షణం లేదు. గుంటూరు పోటీల్లో మావాడు సరిగ్గా ఆడకపోవడం వల్ల తీవ్ర నిరాశలో హైదరాబాద్‌కి తీసుకొచ్చాను. 'క్రికెట్‌ కోచింగ్‌లు ఇక చాలు... బుద్ధిగా చదువుకో!' అనేశాను. నాలుగురోజుల తర్వాత అండర్‌-14 సెలక్షన్స్‌కి మళ్లీ రమ్మని పిలిచారు. మావాడు అందుకు రెడీ అయిపోయాడు కానీ నేను తీసుకెళ్లనని చెప్పాను. వాడు వినకపోవడం వల్ల నా కోపం పెరిగిపోయి 'నీకోసం ఇంకా ఎంత డబ్బు ఖర్చుచేయాలంటావ్‌? నిజంగా కమిట్‌మెంట్‌ ఉంటే... ఈ ఎండలో షర్ట్‌లేకుండా పడుకో!' అని ఆఫీసుకొచ్చేశాను. అప్పుడు సమయం 11.30. అది మే నెల... రోళ్లు పగిలే ఎండలు కాస్తున్నాయి. సరిగ్గా రెండుగంటలకి మా ఆవిడ ఏడుస్తూ ఫోన్‌ చేసి 'వాడు షర్ట్‌ విప్పి ఎర్రటి ఎండలో పడుకున్నాడు. ఎవరు పిలిచినా రావట్లేదు...!' అంది. ఉన్నపళంగా ఇంటికి పరుగెత్తాన్నేను. ఇంటి ముందు ఎండలో పడుకున్నవాణ్ణి అమాంతం ఎత్తుకుని బోరుమని ఏడ్చేశాను. అప్పటికే వాడి ఒళ్లంతా ఎండకి కాలి బొబ్బలు లేచి ఉన్నాయి! ఆ క్షణమే వాడికోసం ఏ త్యాగాన్నైనా చేయాలని నిశ్చయించుకున్నాను!" అంటాడు బాలీషావలి. ఆ తర్వాత ఆయన వేసిన ప్రతి అడుగూ ఆ విషయాన్నే రుజువు చేసింది.

లక్ష రూపాయలిచ్చి...

హైదరాబాద్‌లో ఉప్పల్‌ స్టేడియంలో చిన్నచిన్న క్రికెట్‌ క్లబ్‌లుండేవి. అందులో ఏదైనా క్లబ్‌లో చేరి రెండువేల రూపాయలిస్తే అందులో రషీద్‌ని ఆడనిచ్చేవాళ్లు. కానీ.. ఆ చిన్నారికి అవసరమైనంత బ్యాటింగ్‌ టైమ్‌ ఇచ్చేవారు కాదు. దాంతో తానే ఓ క్లబ్‌ని అద్దెకు తీసుకుందామనుకున్నాడు బాలీషావలి. అందుకు ఏడాదికి లక్ష రూపాయలు చెల్లించాలి! ఏమీ ఆలోచించకుండా అంత మొత్తాన్ని అప్పుతెచ్చి మరీ ఓ క్లబ్‌ని సొంతం చేసుకున్నాడు. కొందరు పిల్లల్నీ చేర్చుకుని.. రషీద్‌కి బ్యాటింగ్‌ చేసే అవకాశం పుష్కలంగా కల్పించాడు. ఆ ప్రాక్టీస్‌తో రాటుదేలిన రషీద్‌ అండర్‌-14 ఆంధ్రా జోనల్‌ స్థాయికి వెళ్లాడు. ఓ మ్యాచ్‌లో రషీద్‌ ఆడుతున్న టీమ్‌ నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోతే బ్యాటింగ్‌కి వెళ్లిన రషీద్‌ 91 పరుగులు చేసి... మ్యాచ్‌ని గెలిపించాడు. అలా పదో ఏటనే అండర్‌-14 రాష్ట్ర స్థాయికి వెళ్లాడు. ఆ జట్టుని మంగళగిరిలోని ఆంధ్రా క్రికెట్‌ అకాడమీ (ఏసీఏ) తీసుకోవడం వల్ల అందులో భాగమైపోయాడు! ఈ ఎంపిక కెరీర్‌పరంగా మంచి విజయమే అయినా... ఆర్థికపరంగా ఆ కుటుంబాన్ని కుదేలు చేసింది.

రషీద్​ తల్లిదండ్రులు

ఉద్యోగం వదులుకున్నాడు..

రషీద్‌ మంగళగిరిలోనే ఉండాల్సి రావడం వల్ల.. అతని కోసం గుంటూరుకి నివాసాన్ని మార్చాడు బాలీషావలి. కాకపోతే హైదరాబాద్‌లో ఉన్నప్పుడు 35 వేల రూపాయలు జీతమిచ్చే అతని కంపెనీ.. గుంటూరుకెళితే 15 వేలే ఇస్తానంది. అందుకు ఒప్పుకుని కుటుంబాన్ని గుంటూరుకి తెస్తే... ఉదయం నుంచి రాత్రిదాకా పనితోనే సరిపోయేది. రషీద్‌ని ప్రాక్టీస్‌కి తీసుకెళ్లడం సాధ్యమయ్యేది కాదు. దాంతో ఆ ఉద్యోగాన్నీ మానేశాడు. రషీద్‌కి ప్రాక్టీస్‌లేని సమయంలోనే కూలికెళ్లేవాడు. పండ్ల మార్కెట్‌లో బండి వద్ద పండ్లు అమ్మడం మొదలుపెట్టాడు. దాంతోపాటు గుంటూరు మిర్చియార్డులో లెక్కలు రాయడానికి కుదురుకున్నాడు. వాటితో రోజుకి నాలుగువందల రూపాయలొచ్చేవి. ఒక్కోసారి ఆ పనులూ దొరక్కపోతే వీధీవీధీ తిరిగి ఫ్యాన్సీ వస్తువులు అమ్మేవాడు. కాకపోతే 'ఈ ఆర్థిక ఇబ్బందులేవీ రషీద్‌కి తెలియకూడదని ఇంట్లోనివాళ్లందరం రొయ్యల వ్యాపారం చేస్తున్నట్టు అబద్ధం ఆడేవాళ్లం!' అంటాడు బాలీషావలి. ఇంటి అద్దెకూడా కట్టలేని పరిస్థితుల్లో... ఇంట్లో ఉన్న చిన్నాచితక బంగారు నగల్ని తాకట్టు పెడుతూనే నెట్టుకొచ్చారు.

కానీ ఈ బాధలన్నింటినీ రషీద్‌ ఆటతీరు మరపించేదట! అండర్‌-14 జట్టులో ఉంటూ మంగళగిరిలో శిక్షణ పొందుతున్నప్పుడు... అక్కడి అకాడమీ నుంచి అతనొక్కణ్ణే ఎంపిక చేసి లండన్‌లో జరిగే కౌంటీ పోటీలకు పంపించారు. ఇక రషీద్‌ అండర్‌-16 జట్టులోకి వెళ్లగానే బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి ఎంపికయ్యాడు. అండర్‌-16 కెప్టెన్‌గానూ రాణించాడు. ఇక కెరీర్‌కి తిరుగులేదు అనుకుంటూండగా 2020లో లాక్‌డౌన్‌ రషీద్‌ శిక్షణనే కాదు... వాళ్ల ఆర్థికపరిస్థితినీ దెబ్బతీసింది.

ఉన్నవన్నీ అమ్మేశారు...

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా బెంగళూరు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీని మూసేయడం వల్ల ఇంటికి వచ్చేశాడు. మునుపటిలా రషీద్‌ చిన్నపిల్లాడు కాదు... నాన్న చేసేది రొయ్యల వ్యాపారం కాదని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. 'మా ఇల్లు చూడగానే-నాన్నకు సరైన సంపాదన లేదనీ, వచ్చిన కాస్త డబ్బునీ నా శిక్షణా, కిట్‌లూ, ఆహారం కోసమే ఖర్చు పెట్టారని అర్థమైంది. ఇంజినీరింగ్‌ చదువుతున్న అన్నయ్య రియాజ్‌ వేసుకునే బట్టలూ పాతబడి ఉన్నాయి. నా కోసం ఈ కుటుంబం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందో అప్పుడే అర్థమైంది!' అంటాడు రషీద్‌. ఈ ఆర్థిక ఇబ్బందులన్నింటికీ పరాకాష్టగా.. అప్పటిదాకా తాకట్టుపెట్టిన బంగారు నగల్నీ భార్యకి తెలియకుండా అమ్మేశాడు బాలీషావలి! ఆ కష్టాలిచ్చిన పట్టుదలతో ఒంటరిగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు రషీద్‌. సాధారణంగా బ్యాటింగ్‌ సాధనకోసం బాల్స్‌ వేసేవాళ్లకి నెలకి రూ.15 వేలు చెల్లిస్తుండాలి. ఆ ఖర్చు భరించలేక... శరీరం సహకరించకున్నా సరే బాలీషావలియే తన కొడుక్కి 'అండర్‌ ఆర్మ్‌ త్రోయర్‌'గా మారాడు! ఈ కష్టాలన్నింటి నుంచి అండర్‌-19 ప్రపంచకప్‌ విజయం గట్టెక్కించింది. సెమీఫైనల్‌ ఫైనల్లో జట్టుని విజయతీరాలకు చేర్చడంలో రషీద్‌ కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో చాలా ఏళ్ళ తర్వాత టీమ్‌ ఇండియాకి రాగల సత్తా ఉన్న తెలుగు కుర్రాడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు.

కాకపోతే ఈ వరల్డ్‌కప్‌లోని రెండో మ్యాచ్‌ తర్వాత ఓ దశలో రషీద్‌ కొవిడ్‌ బారినపడి ఐసోలేషన్‌లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఇంట్లోవాళ్లు పడ్డ కంగారు అంతాఇంతా కాదు. ఈసారి నిజానికి తొలిసారి.. తనే అమ్మానాన్నలకి ధైర్యం చెప్పాడు. తన ఆందోళననంతా గుంటూరులోని తన కోచ్‌ కృష్ణారావుతోనే పంచుకుని సూచనలు తీసుకున్నాడు. ప్రపంచ కప్‌ విజయం సంగతి అలా పక్కనపెడితే 'అకస్మాత్తుగా ఇంత ధైర్యం పరిణతీ ఎలా వచ్చాయి?' అని అడిగితే.. 'లాక్‌డౌన్‌ కాలంలో ఇంట్లో ఉన్న ఏడాదిపాటు నాన్న కష్టాన్ని నేరుగా చూశాకే...' అంటున్నాడు రషీద్‌.

ఇదీ చూడండి :ఆ ఒక్క వికెట్​తో చాహల్​ రికార్డు సృష్టిస్తాడా?

ABOUT THE AUTHOR

...view details