టీమ్ఇండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నేడు 41వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతనికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది బీసీసీఐ. సుదీర్ఘ కాలం పాటు భారత స్పిన్ విభాగానికి సేవలందించిన భజ్జీ.. ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున కొనసాగుతున్నాడు. 1998లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసిన ఈ పంజాబ్ బౌలర్.. అదే ఏడాది కివీస్‌పై వన్డేల్లోకి అడుగుపెట్టాడు. అతని బర్త్‌డే సందర్భంగా అతడు సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి.
భజ్జీ తన కెరీర్లో 103 టెస్టులతో పాటు 236 వన్డేలు, 28 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 417 వికెట్లు తీసిన ఈ ఆఫ్ స్పిన్నర్.. 50 ఓవర్ల ఫార్మాట్లో 269 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీమ్ఇండియా తరఫున అనిల్ కుంబ్లే తర్వాత అత్యంత విజయవంతమైన స్పిన్నర్ భజ్జీనే కావడం విశేషం. అలాగే 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన భారత జట్టులో హర్భజన్ సభ్యుడు. నాలుగు సార్లు ఐపీఎల్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు.
తొలి హ్యాట్రిక్ భజ్జీదే..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా 2001లో ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. ఆ మ్యాచ్‌లో భారీ డబుల్ సెంచరీతో చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడిన లక్ష్మణ్ తర్వాత మరో హీరో భజ్జీనే. ఈ టెస్టులో హ్యాట్రిక్‌తో మెరిసిన ఈ వెటరన్ స్పిన్నర్.. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 32 వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు భజ్జీ పేరిటే ఉంది.