Gujarat vs Rajasthan Preview: ఈసారి కొత్తగా వచ్చిన గుజరాత్ జట్టు ఆది నుంచి అద్భుత విజయాలతో నంబర్‌వన్ స్థానంలో దూసుకెళ్లింది. హార్దిక్ పాండ్య నేతృత్వంలో మొత్తం 14 లీగ్ మ్యాచుల్లో 10 విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు రాజస్థాన్ ప్లేఆఫ్స్‌లో మెరుగైన చోటు కోసం తమ చివరి లీగ్ మ్యాచ్‌వరకూ పోరాడింది. సంజూ టీమ్.. లఖ్‌నవూ లాగే తొమ్మిది విజయాలతో నిలవగా.. మెరుగైన నెట్‌రన్‌రేట్ కారణంగా రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఆ జట్టు గుజరాత్‌తో తొలి క్వాలిఫయర్‌లో పోటీపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుండగా ఓడిన జట్టు రెండో క్వాలిఫయర్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం దొరుకుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుతో రెండో క్వాలిఫయర్‌లో తలపడనుంది.
కొత్త జట్టు.. నూతన సారథ్యం:హేమాహేమీలు సారథులుగా ఉన్న ఈ భారత టీ20 లీగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అనుభవం లేకుండా నాయకత్వ బాధ్యతలు చేపట్టి జట్టును నడపించడం అంత తేలికైన విషయం కాదు. అయితే జట్టు సభ్యుల మద్దతుంటే పెద్ద కష్టమేం కాదని నిరూపించాడు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య. గతేడాది వరకు ముంబయి తరఫున ఆడిన అతడిని మెగా వేలానికి ముందే గుజరాత్ కొనుగోలు చేసింది. ఏకంగా కెప్టెన్సీ కట్టబెట్టడం విశేషం. అయితే, గుజరాత్ లీగ్ దశలో సాధించిన 10 విజయాల్లో ఏడుసార్లు ఛేజింగ్‌లో గెలవడం గమనార్హం. ఈ జట్టు సమష్టిగా రాణించడమే అందుకు కారణం. టాప్‌ఆర్డర్ విఫలమైనప్పుడు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించడం గుజరాత్‌కు కలిసొచ్చింది. ఆ జట్టులో టాప్ బ్యాట్స్‌మన్‌గా హార్దిక్ పాండ్య 413 పరుగులతో 11వ స్థానంలో నిలిచాడు. 403 రన్స్‌తో శుభ్‌మన్ గిల్ 13వ స్థానంలో నిలిచాడు.
గత చివరి నాలుగు మ్యాచ్‌లను తీసుకుంటే ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహాలో ఒకరు మాత్రమే మంచి ఆరంభం ఇస్తున్నారు. అయినప్పటికీ స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకుని ఆ జట్టు ఒత్తిడిలోకి వెళ్తోంది. ఆఖర్లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ హిట్టర్లు.. స్ట్రోక్ షాట్లు ఆడుతుండటంతో విజయాలను నమోదు చేస్తోంది. అయితే షమీ, దయాల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్‌తో బౌలింగ్ దళం పటిష్ఠంగా ఉండటం గుజరాత్‌కు బాగా కలిసొస్తున్న మరో విషయం. సాయికిశోర్ కూడా అవకాశం వచ్చినప్పుడు ఫర్వాలేదనిపించాడు. ఇక ఓడిపోయిన నాలుగు మ్యాచుల్లో మూడుసార్లు గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేసింది. అంటే లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పొరపాటున నాకౌట్ దశలో ఇలాగే తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఫలితంలో తేడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇక బౌలింగ్ పరంగా అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లలో రషీద్ ఖాన్ (18) ఆరు, షమీ (18) ఎనిమిదో స్థానంలో చోటు దక్కించుకున్నారు.