Gambhir Slams Kohli: దక్షిణాఫ్రికాతో చివరిటెస్టులో భాగంగా.. మూడోరోజు ఆటలో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. డీఆర్ఎస్ నిర్ణయంపై కోహ్లీ వ్యవహరించిన తీరును 'పరిణతి లేని చర్యగా' అభివర్ణించారు. ఈ విధానంతో కుర్రాళ్లకు రోల్ మోడల్ ఎప్పటికీ కాలేవని అన్నాడు గంభీర్.
" ఇది చాలా దురదృష్టకరం. స్టంప్స్ మైక్ వద్దకు వెళ్లి వ్యాఖ్యలు చేయడం ఒక పరిణతి లేని చర్య. అంతర్జాతీయ కెప్టెన్, టీమ్ఇండియా సారథి నుంచి కోరుకునేది ఇది కాదు." అని గంభీర్ స్పష్టం చేశాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో మయాంక్ అగర్వాల్ ఎల్బీడబ్ల్యూ విషయంలోనూ ఇలాంటి నిర్ణయమే వచ్చిందని.. ఆ సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్ వ్యవహరించిన తీరును గుర్తుచేశాడు గంభీర్.
"టెక్నాలజీ మీ చేతిలో లేదు. అలాంటప్పుడు నువ్వు దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ లానే వ్యవహరించాల్సింది." అని గంభీర్ అన్నాడు.
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేరిల్ కల్లీనన్ కూడా కోహ్లీ వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. కోహ్లీ.. తాను ఎలా అనుకుంటే అలానే ప్రవర్తిస్తాడని మండిపడ్డాడు. అలాంటి ప్రవర్తనతో కోహ్లీకి ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఆటను ప్రేమిస్తానని, అతడు ఆడే విధానం తనకు నచ్చుతుందని.. కానీ ఇలాంటి చర్యలకు అతడిని శిక్షించాలని అన్నాడు.