Suryakumar Yadav Ponting: ఇటీవల ఓ సందర్భంలో టీమ్‌ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌తో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పోల్చాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ (ఎస్‌కేవై) ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. ఆసియా కప్‌లో రాణిస్తే తొలి ర్యాంకర్ బాబర్ అజామ్‌ను అధిగమించే అవకాశం సూర్యకుమార్‌కు ఉంది. విండీస్‌తో జరిగిన టీ20 సిరీసులో అన్ని వైపులా షాట్లు కొట్టడంతో పాంటింగ్ ఈ విధంగా అభివర్ణించాడు. అయితే ఏబీడీతో సూర్యకుమార్‌ను పోల్చడం తొందరపాటు అవుతుందని పాక్ మాజీ సారథి సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు. ఏబీడీ వంటి మరో ఆటగాడిని క్రికెట్ ప్రపంచంలో చూడలేమని పేర్కొన్నాడు.
"ఏబీ డిలివియర్స్ బ్యాటింగ్ శైలి సూపర్‌గా ఉండేది. ఇలాంటి ఆట అతడికే సొంతం. క్రికెట్ చరిత్రలో ఏబీ శైలిలో ఎవరూ ఆడలేరనేది నా అభిప్రాయం. ఏబీని ఔట్ చేయకపోతే ఓడిపోతామని ప్రత్యర్థుల బౌలర్లకు తెలుసు. ఇలాంటి కోవలోకి వచ్చేవారే రూట్, విలియమ్సన్, కోహ్లీ. ఇక భారత సారథి రోహిత్ శర్మ తనదైన రోజున వన్డేలోనూ 250కిపైగా పరుగులు చేసిన ఘనుడు. ఇటువంటి ఆటగాళ్లు ఉన్న సమయంలో సూర్యకుమార్‌ను ఏబీతో పోల్చడం తొందరపాటు అవుతుంది. ఎందుకంటే ఎస్‌కేవై ఇప్పుడే కెరీర్‌ను ప్రారంభించాడు. అతడు చాలా టాలెంట్ కలిగిన ఆటగాడు." అంటూ సల్మాన్ భట్ చెప్పుకొచ్చాడు.