Ravi Shastri India jealous gang: టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ వ్యక్తి ఓడిపోవాలని కోరుకునే వర్గం ఇండియాలో ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చాడు. అసూయ అనేది ప్రతిసారి తమను వెంటాడుతుందని అన్నాడు. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఎండీగా 'రాబ్ కీ'ని నియమించడంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు శాస్త్రి. యూకేలో రాబ్‌ను సైతం ప్రతిక్షణం జడ్జ్ చేస్తారని.. సమయానుగుణంగా పరిస్థితులకు అతడు అలవాటు పడతాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఈ మేరకు యూకే వార్తాపత్రిక 'ది గార్డియన్'కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
Ravi Shastri guardian: "ఇండియా వంటి దేశంలో అసూయ అనేది ఎప్పుడూ ఉంటుంది. మనం విఫలమవ్వాలని కోరుకునే గ్యాంగ్ ఉంటూనే ఉంటుంది. కానీ నా చర్మం గట్టిది(విమర్శలను పట్టించుకోననే ఉద్దేశంతో).. మీరు వాడే డ్యూక్ బంతి లెదర్ కన్నా గట్టిది. నేను మానసికంగా దృఢంగా ఉండేవాడిని. రాబ్‌కు ఇదే అవసరం. ఎందుకంటే ప్రతిరోజూ అతడిని జడ్జ్ చేస్తారు. కెప్టెన్‌గా గడించిన అనుభవం, ఆటగాళ్లతో కమ్యూనికేషన్ ఉండటం అతడికి సానుకూలాంశాలు" అని శాస్త్రి పేర్కొన్నాడు. రాబ్ ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని తెలిపాడు. ఇంగ్లాండ్ జట్టుకు కొత్త కెప్టెన్, కోచ్‌లను నియమించాల్సిన బాధ్యత అతడిపై ఉందని వివరించాడు. సారథిగా బెన్ స్టోక్స్‌ను నియమిస్తే బాగుంటుందని శాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు. తన 24 ఏళ్ల కామెంట్రీ కెరీర్లో.. ఇండియా ఆడిన మ్యాచ్‌లలో ఏ ఒక్క బాల్‌ను గానీ, షాట్‌ను గానీ మిస్ అవ్వలేదని శాస్త్రి చెప్పుకొచ్చాడు. రాబ్ సైతం చాలా క్రికెట్ చూశాడని.. ఇంగ్లాండ్ జట్టుకు ఏం అవసరమో అతడికి తెలుసని అన్నాడు.
ఆటగాళ్లలో టీమ్ కల్చర్‌ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాను వారి దేశంలోనే రెండు వరుస సిరీస్‌లలో ఓడించినప్పుడు తాను అదే పని చేశానని చెప్పాడు. 'ఫిట్నెస్ స్థాయి పెంచుకోవాలని అనుకున్నాం. దూకుడుగా, కఠినంగా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఆసీస్‌తో ఆడాలంటే ఆ దృక్ఫథం అవసరం. పనికిరాని మాటలు ఎవరైనా మాట్లాడితే.. మీ భాషలో మూడు రెట్లు దీటుగా స్పందించాలని మా ఆటగాళ్లతో చెప్పా' అని రవిశాస్త్రి వివరించాడు.