తెలంగాణ

telangana

By

Published : Dec 7, 2022, 10:32 PM IST

ETV Bharat / sports

నాయకా.. నీ పోరాటం అమోఘం!.. దెబ్బ తగిలిన విషయం అసలు గుర్తుందా?

నాయకుడు అంటే నడిపించేవాడు.. జట్టులో స్ఫూర్తి నింపేవాడు.. కష్టకాలంలో ముందుకొచ్చి ఆదుకొనేవాడు.. ఇలా ఒక్కటేంటి నాయకుడు గురించి చెప్పాలంటే చాలా మాటలే ఉన్నాయి. అయితే వాటికి నిలువెత్తు రూపాన్ని చూపించాల్సి వస్తే.. ఈ రోజు మ్యాచ్‌లో రోహిత్‌ శర్మను చూపించాలి. జట్టుకు విజయాన్ని అందించలేకపోవచ్చు కానీ అతడి పోరాట పటిమ అమోఘం. అద్వితీయం!!

rohit sharma
రోహిత్​ శర్మ

Rohit Sharma Bangladesh Match : బంగ్లాదేశ్‌తో మీర్పూర్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్‌ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితేనేం కొన ఊపిరితో ఉందనుకుంటున్న వన్డే క్రికెట్‌కి ఊపిరిలూదింది. 'వన్డే మ్యాచా? ఎవరు చూస్తారు' అని అనుకునే సగటు క్రికెట్‌ అభిమానికి ఎనలేని కిక్‌ నిచ్చింది. దానంతటికీ కారణం ఒకే ఒక్కడు.. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.

ఫీల్డింగ్‌ సమయంలో గాయంతో పెవిలియన్‌కి చేరిన రోహిత్‌.. బ్యాటింగ్‌లో ఎనిమిదో డౌన్‌లో వచ్చాడు. అప్పటికి మ్యాచ్‌ భారత్‌ వైపు లేదు. కానీ ఎక్కడో చిన్న ఆశ. హిట్‌ మ్యాన్‌ ఈ రోజు హిట్‌ కొడతాడు అని. అవతలి వైపు బ్యాటర్లు.. బంతిని కనెక్ట్‌ చేయలేక ఇబ్బంది పడుతున్నా.. రోహిత్‌ ఉన్నాడనే ఆశ అభిమానుల్లో ఉంది. అనుకున్నట్లుగా రోహిత్‌ జట్టును విజయ తీరాలకు చేర్చే ప్రయత్నం చేశాడు. ఎడమ చేతి బొటన వేలి గాయమైందనే విషయం కూడా ప్రేక్షకులు మరచిపోయేంతగా బ్యాటింగ్‌ చేశాడు.

ఐదు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 28 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ పరుగులు, లెక్కలు రోహిత్‌ కష్టానికి కొలమానం అస్సలు కాదు. ఎందుకంటే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. తన గాయాన్ని సైతం లెక్క చేయకుండా మైదానంలోకి దిగాడు. యువతకు అంకిత భావం అంటే ఏమిటి? జట్టు కోసం ఏం చేయాలి? అని ఏవైనా తరగతులు చెప్పాలనుకుంటే.. ఈ మ్యాచ్‌ చూపిస్తే సరి అన్నట్లుగా ఆడాడు.

రోహిత్​ శర్మ

ఇక ఫలితం అంటారా? అది ఒక్క రోహిత్‌ చేతిలోనే లేదు. తన బ్యాటింగ్‌ అవకాశం వచ్చినప్పుడల్లా బంతిని స్టాండ్స్‌లోని పంపించాడు. ఒక్కో షాట్‌కి ఫ్యాన్స్ స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆఖరి బంతికి ఆరు పరుగులు కొట్టాల్సిన సమయంలో అనుకున్న షాట్‌ ఆడలేకపోయాడు. చివరికంటూ పోరాడి ఒక్క మెట్టు దూరంలో ఓటమిని అంగీకరించాడు.

కానీ, గాయం తన పోరాట పటిమను ఏమాత్రం తగ్గించలేకపోయిందని నిరూపించాడు. ఓ యోధుడిలా పెవిలియన్‌కు నడుస్తున్న రోహిత్‌కు ప్రత్యర్థి ప్రేక్షకులు, వీక్షకులూ చప్పట్లతో అభినందించారు. ఇలాంటి ఫీట్‌లు రోహిత్‌కే సాధ్యమని సోషల్‌మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్‌ ఇన్నాళ్లు సాధించిన సెంచరీలు, డబుల్‌ సెంచరీలు ఎంత గొప్పవో.. ఈ రోజు సాధించిన అర్ధ సెంచరీనీ వాటితోనే పోలుస్తున్నారు అభిమానులు.

ABOUT THE AUTHOR

...view details