దక్షిణాఫ్రికా లెగ్‌స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అంతర్జాతీయ వన్డేల నుంచి తప్పుకోనున్నాడు. వచ్చే ప్రపంచకప్ అనంతరం ఈ ఫార్మాట్ నుంచి దూరమవుతున్నట్టు ప్రకటించాడు. పాకిస్థాన్‌లో పుట్టి పెరిగిన ఈ క్రికెటర్ ప్రపంచకప్ అనంతరం టీ 20లకు మాత్రమే అందుబాటులో ఉంటానని తెలిపాడు. కుర్రాళ్లకి అవకాశమివ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు.
ప్రపంచకప్పే నాకు చివరిది... - సౌతాఫ్రికా
వన్డేలకు దూరమైనా.. టీ 20 క్రికెట్లో కొనసాగుతానని దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ప్రకటించాడు.
"దేశం తరఫున ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా. జాతీయ జట్టులో సభ్యుడిగా ప్రపంచకప్‌లో ఆడటమే గొప్ప గౌరవంగా భావిస్తా. నాకదే పెద్ద ఘనత. ఈ టోర్నీలో జట్టు విజయాలకు నా వంతు కృషి చేస్తాను. కుర్రాళ్లకి అవకాశమివ్వాలి. వన్డేల నుంచి దూరమైనా.. టీ 20 ఫార్మాట్లో కొనసాగుతాను"
-- ఇమ్రాన్ తాహిర్, దక్షిణాఫ్రికా ఆటగాడు
ఎనిమిదేళ్ల తన కెరీర్లో ఎన్నో ప్రశంసలు అందుకున్నాడీ క్రికెటర్. 2011లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తాహిర్ 95 వన్డేల్లో 24.56 సగటుతో 156 వికెట్లు తీశాడు. వన్డేల్లో దక్షిణాఫ్రికా తరపున వేగంగా 100 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఒక వన్డే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన తొలి సౌతాఫ్రికా ఆటగాడు తాహిరే కావడం విశేషం.