ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఊహించని విజయం సాధించింది. ఆటగాళ్ల పోరాటం, పట్టుదల ముందు గెలుస్తుందనుకున్న ఆతిథ్య జట్టు 151 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్ శతకం, రెండో ఇన్నింగ్స్‌లో పుజారా-రహానె శతక భాగస్వామ్యం, బుమ్రా-షమీ 89 పరుగుల కీలక భాగస్వామ్యం, ఆపై బౌలింగ్‌లో కలిసికట్టుగా రాణింపుతో పాటు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య సున్నిత కవ్వింపులు లాంటివి చాలా జరిగాయి. అయితే, వాటికన్నా ముఖ్యంగా భారత అభిమానులను ఆకట్టుకున్నది మరో విశేషం ఉంది. అదే కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మను హత్తుకోవడం. ఇప్పుడా వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.
ఐదోరోజు సోమవారం టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 298/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండో సెషన్ పూర్తయ్యేసరికి 67/4తో నిలిచింది. టీ బ్రేక్‌కు ముందు ఇషాంత్ శర్మ వేసిన చివరి బంతికి బెయిర్‌స్టో వికెట్ల ముందు దొరికిపోగా అంపైర్ నాటౌటిచ్చాడు. భారత్ రివ్యూకు వెళ్లడం వల్ల అతడు ఔట్‌గా తేలాడు. దాంతో కోహ్లీ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఈ క్రమంలోనే తోటి ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు.