తెలంగాణ

telangana

ETV Bharat / sports

కనికరం లేకుండా విరుచుకుపడ్డాం: రూట్

తమ జట్టు పేసర్లు అద్భుతంగా రాణించారని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్​ కొనియాడాడు. ఇలాంటి ప్రదర్శన చేస్తామని తమకు ముందే తెలుసని అన్నాడు. మూడో టెస్టులో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడీ ఇంగ్లాండ్ సారథి.

joe root
జో రూట్

By

Published : Aug 28, 2021, 10:21 PM IST

టీమ్‌ఇండియాపై వికెట్లు తీసే అవకాశం దొరికినప్పుడు కనికరం లేకుండా విరుచుకుపడ్డామని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ అన్నాడు. మూడో టెస్టులో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించాక అతడు మాట్లాడుతూ తమ పేసర్లను కొనియాడాడు. వారు అద్భుతమైన ప్రదర్శన చేశారని, ఇలాంటి మంచి ప్రదర్శన చేస్తామని తమకు ముందే తెలుసని రూట్‌ పేర్కొన్నాడు. అంతటి నైపుణ్యం ఇంగ్లాండ్‌ జట్టుకు ఉందని, ఈ క్రమంలోనే నాలుగో రోజు కొత్త బంతితో చెలరేగామని వివరించాడు. బంతితో అండర్సన్‌ మాయచేశాడని కొనియాడాడు. ఇప్పటికీ అతడు ఇతర బౌలర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడని, అందుకే అతడిని టెస్టు క్రికెట్‌లో గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ అని అభివర్ణిస్తారని అన్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో రాణించిన ఓపెనర్లు రోరీ బర్న్స్‌, హమీద్‌తో పాటు డేవిడ్‌ మలన్‌ కూడా బాగా ఆడారన్నాడు. మరోవైపు తన హోమ్‌ గ్రౌండ్‌లో చాలా రోజుల తర్వాత శతకం బాదడం గొప్పగా ఉందన్నాడు. ఇక ముందు కూడా ఇలాంటి ప్రదర్శనతోనే ముందుకు సాగుతామన్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైన రాబిన్‌సన్‌ను గురించి మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో అతడు అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని పేర్కొన్నాడు. అతడు బంతిని రెండు వైపులా తిప్పుతూ భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడన్నాడు.

అనంతరం సామ్‌ కరన్‌పై స్పందించిన రూట్‌.. అతడు ఈ మ్యాచ్‌లో రాణించకపోయినా కీలక ఆటగాడని గుర్తుచేశాడు. గతంలో టీమ్‌ఇండియాపై మంచి ప్రదర్శన చేసినట్లు ఇంగ్లాండ్‌ సారథి చెప్పుకొచ్చాడు. చివరగా బట్లర్‌ పితృత్వపు సెలవులపై స్పందిస్తూ.. దాని గురించి తర్వాత తెలుస్తుందని చెప్పాడు. ఇక మిగిలిన రెండు టెస్టుల్లోనూ తాము ఇలాగే ఆడతామనే ధీమా వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:రూట్ ఖాతాలో మరో రికార్డు.. ఒకే ఒక్క సారథిగా!

ABOUT THE AUTHOR

...view details