తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఎవరు ఏమనుకున్నా.. నేను బాగానే ఆడుతున్నా' - విజయ్ శంకర్

ఎవరేమి అనుకున్నా తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానంటూ ఆల్​రౌండర్​ విజయ్ శంకర్​ తెలిపాడు. ఐపీఎల్​లోనూ చెప్పుకోదగ్గ బౌలింగ్​ చేశానని పేర్కొన్నాడు. ఇతరులతో పోల్చాల్సినప్పుడు చాలా మంది ఆటగాళ్ల కంటే తాను మెరుగైన ప్రదర్శన చేశానని చెప్పుకొచ్చాడు.

vijay shankar, team india cricketer
విజయ్ శంకర్, టీమ్​ఇండియా క్రికెటర్

By

Published : May 16, 2021, 6:55 AM IST

2019 వన్డే ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అంబటి రాయుడిని కాదని మూడు రకాలుగా ఉపయోగపడతాడంటూ(3డీ ఆటగాడు) ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఎంచుకోవడం అప్పట్లో దుమారం రేపింది. అంచనాలను అందుకోకపోవడం వల్ల అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫునా శంకర్‌ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆ జట్టు అభిమానుల ఆగ్రహాన్ని అతను ఎదుర్కోక తప్పలేదు. అయితే శంకర్‌ మాత్రం తన ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నానంటున్నాడు. తాను మాత్రం చాలా మంది ఆటగాళ్ల కంటే మెరుగైన ప్రదర్శనే చేశానని వ్యాఖ్యానించాడు.

"ఐపీఎల్‌లో నా జట్టు తరఫున బాగానే బౌలింగ్‌ చేశా. బ్యాటింగ్‌ విషయానికి వస్తే నేను క్రీజులోకి దిగినపుడల్లా.. కొన్ని వికెట్లు పడి, నెట్‌ రన్‌రేట్‌ 10-12 మధ్య ఉంటోంది. ఇలాంటి సమయంలో పరుగులు సాధించడం అంత తేలిక కాదు. టీమ్‌ఇండియా తరఫునా నేను బాగానే ఆడా. అయితే బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయగల ఆల్‌రౌండర్‌ను కాబట్టి నేను జట్టులో ఉండాలి అనుకోవట్లేదు. నా సామర్థ్యాలను జనాలు నమ్మినపుడే నేను జట్టులోకి రావాలనుకుంటున్నా. ఒకవేళ ఇతరులతో పోల్చాలి అంటే మాత్రం చాలా మంది ఆటగాళ్ల కంటే నేను మెరుగైన ప్రదర్శన చేశా. టీమ్‌ఇండియాలోకి తిరిగి రావడం గురించి ఆలోచించట్లేదు. అది నా చేతుల్లో లేదు. దేశం కోసం ఆడినవాళ్లు ఎవరైనా మళ్లీ ఆ జెర్సీ ధరించాలని ఆశపడతారు. నాకు వచ్చిన అవకాశాలను అందుకుని రాణించినప్పటికీ నన్ను జట్టులో కొనసాగించలేదని నిరాశగా ఉంది. చివరగా న్యూజిలాండ్‌తో టీ20ల్లోనూ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌ చేసి మంచి స్కోర్లు సాధించా. నేనాడిన 12 వన్డేల్లో ఎనిమిది లేదా తొమ్మిది సార్లు మాత్రమే బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. అందులో అయిదు సార్లు సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా ఉన్న సమయంలోనే క్రీజులోకి వెళ్లా" అని 30 ఏళ్ల విజయ్‌ తెలిపాడు.

దేశవాళీలో తమిళనాడు తరఫున ఎక్కువగా బ్యాటింగ్​ చేసే అవకాశం రావట్లేదని, అందుకే జట్టు మారే యోచనలో ఉన్నట్లు అతను పేర్కొన్నాడు. ఇప్పటివరకూ భారత్ తరఫున 12 వన్డేలాడిన విజయ్​ 223 పరుగులు చేసి 4 వికెట్లు తీశాడు. 9 టీ20ల్లో 101 పరుగులతో పాటు 5 వికెట్లు పడగొట్టాడు. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత హార్దిక్​ పాండ్య పూర్తి స్థాయిలో బౌలింగ్​ చేయలేకపోతున్నాడు. దీంతో అతనికి ప్రత్యామ్నాయంగా మళ్లీ జట్టులో తనకు అవకాశం దక్కుతుందని విజయ్ ఆశిస్తున్నాడు.

ఇదీ చదవండి:ఇంగ్లాండ్​ బయల్దేరిన కివీస్​ ఆటగాళ్లు

ABOUT THE AUTHOR

...view details