టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుందని 23 ఏళ్ల పాకిస్థాన్ యువ ఆటగాడు షాహ్‌నవాజ్ దహాని అన్నాడు. గత టీ20 ప్రపంచకప్లో మహీని కలిసిన క్షణాలను దహాని గుర్తుకు తెచ్చుకున్నాడు. ధోనీని కలవాలని ఎప్పటి నుంచో అనుకున్నట్లు, ఆ కోరిక టీ20 ప్రపంచకప్ సందర్భంగా నెరవేరిందని షాహ్‌నవాజ్ తెలిపాడు. ఈ సందర్భంగా మహీ ఇచ్చిన సూచనలు చాలా విలువైనవని చెప్పాడు. ధోనిని కలవడం.. తన కల నిజమైన వేళ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
"మహేంద్ర సింగ్ ధోనీ గురించి చెప్పాలంటే నాకు చాలా సమయం పడుతుంది. ఆయన్ను కలవాలనే కల నిజమైంది. జీవితంలో ఆ సంఘటనను మరిచిపోలేను. జీవితం గురించి.. పెద్దవాళ్లను ఏ విధంగా గౌరవించాలి.. క్రికెట్‌లో మంచి రోజులు, కలిసిరాని రోజులుంటాయని చెప్పాడు. అయితే ఆట పట్ల అంకితభావం ప్రదర్శించాలి. ఆటను ఎక్కువగా ప్రేమిస్తేనే ఉన్నత శిఖరాలకు చేరుకోగలవని వివరించాడు" అని దహాని పేర్కొన్నాడు.