తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: ధోనీ మళ్లీ అలాగే చేస్తాడా? - ఐపీఎల్​ ధోనీ

Dhoni IPL 2022: మహేంద్ర సింగ్‌ ధోనీ ఏ పని చేసినా ఓ పద్ధతి ప్రకారం ఉంటుంది. అతని కెరీర్‌ ముగింపును పరిశీలిస్తే తన తర్వాత టీమ్‌కు పెద్ద దిక్కు.. అంటే కెప్టెన్‌ను రెడీ చేసే వెళ్లాడు. మరిప్పుడు చెన్నై సూపర్‌కింగ్స్‌ విషయంలో ఇదే చేస్తాడా? ప్రస్తుతం దీని గురించే ఐపీఎల్‌ వర్గాలు, ఫ్యాన్స్‌లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ధోనీ ఏం చేయొచ్చు, ఏం చేస్తే జట్టుకు మంచిది అనేది ఓసారి చూద్దాం!

DHONI
DHONI

By

Published : Mar 23, 2022, 2:59 PM IST

Dhoni IPL 2022: ధోనీ ఇప్పుడేం చేయొచ్చు అనేది చదివే ముందు.. అసలు టీమిండియాకు ధోనీ ఏం చేశాడో చూద్దాం. టీమిండియా ఆటగాడి నుంచి కెప్టెన్‌గా మారడానికి ధోనీకి ఎంతో సమయం పట్టలేదు. భారత్‌ జట్టు సభ్యత్వం పొందిన సుమారు 17 నెలల్లోనే కెప్టెన్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి టెస్టు పగ్గాలు అందుకున్నాడు. 2005 డిసెంబరులో టెస్టు జట్టులో చేరగా, ఆ తర్వాత 2007 ఏప్రిల్‌లో కెప్టెన్‌ అయ్యాడు. ఆ తర్వాత వన్డేలు, టీ20లకు నాయకత్వ బాధ్యతలు అందుకున్నాడు. అతని హయాంలోనే భారత్‌ 2007 టీ20 ప్రపంచకప్‌ గెలుపొందింది. వన్డేల్లో ధోనీ ఘనత చెప్పాలంటే 2011 ప్రపంచకప్‌, 2013 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీల గురించి చెప్పుకోవాలి. అదే టెస్టుల్లో గొప్పతనం గుర్తు చేయాలంటే… ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ టాప్‌లో నిలిచింది (2009) ధోనీ నాయకత్వంలోనే. భారత్‌ వల్ల కాదు అని అంతర్జాతీయ మాజీలు చెప్పే ఎన్నో టూర్‌లను విజయవంతంగా పూర్తి చేశాడు ధోనీ.

ధోనీ

Dhoni Captaincy: ధోనీ కెప్టెన్సీ కెరీర్‌ ఆసాంతం అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఒకానొక సమయంలో విదేశాల్లో వరుసగా ఎనిమిది పరాజయాలు రావడంతో ధోనీ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. వాటిని దీటుగా ఎదుర్కొన్న ధోనీ.. జట్టును పునర్‌ నిర్మించాడు. యువతకు పెద్ద పీట వేస్తూ తిరిగి విజయాల బాట పట్టించాడు. ఈ క్రమంలో వయసు పైనపడుతుండటం, కుర్రకారుకు అవకాశమివ్వాల్సిన అవసరం ఉందని గ్రహించడం లాంటివి మొదలయ్యాయి. అప్పుడప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్న విరాట్‌ కోహ్లీని ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. ఎలా అయితే ధోనీలోని నాయకత్వ లక్షణాలను ద్రవిడ్‌ చూశాడో… కోహ్లీలోని టాలెంట్‌ను ధోనీ చూశాడు అంటారు క్రికెట్‌ పండితులు.

ధోనీ

Virat Kohli: ఇక విరాట్‌ కోహ్లీకి అవకాశాలు ఇవ్వడం, అతన్ని వెనకుండి నడిపించడం, జట్టు వరుసగా విజయ ఢంకా మోగించడం... ఇదంతా ఇప్పటితరం క్రికెట్‌ వీక్షకులు, ధోనీ అభిమానులకు తెలిసిందే. కేవలం కెప్టెన్‌ అనే కాకుండా మిగిలిన టీమ్‌ మొత్తాన్ని తన స్టైల్‌లో విజయం ఇచ్చే కిక్‌ని ఆస్వాదించడం అలవాటు చేశాడు. టీమిండియా అనే కాదు, ఐపీఎల్‌లోనూ ధోనీ ఇలానే వ్యవహరిస్తున్నాడు. కూల్‌గా, కామ్‌గా మైదానంలోకి రావడం, పని పూర్తి చేసుకొని వెళ్లిపోవడం. విజయం వస్తే పొంగిపోవడం, పరాజయం వస్తే కుంగిపోవడం చెన్నై సూపర్‌కింగ్స్‌ దరిదాపుల్లోకి రాకుండా చూసుకున్నాడు. అందుకే నాలుగు సార్లు ఐపీఎల్‌ ట్రోఫీని సాధించింది చెన్నై సూపర్‌ కింగ్స్‌.

విరాట్​తో ధోనీ

CSK Dhoni: అయితే… ధోనీకి ఇప్పుడు 40 ఏళ్లు. అన్నట్లు ధోనీ వయసు గురించి మాట్లాడితే బాగోదేమో. ఎందుకంటే ఏ రోజూ అంత వయసు మీద పడిన క్రికెటర్‌లా కనిపించడు కాబట్టి. ఇప్పటికీ మైదానంలో కుర్రాళ్లతో పోటీపడుతుంటాడు కూడా. అలా అని ఏళ్లకేళ్లు జట్టుకు నాయకత్వం వహించడం అంత సులభమేమీ కాదు. అందుకే ‘చెన్నైలో ధోనీ నెక్స్ట్‌ ఎవరు?’ అనే ప్రశ్న మొదలైంది. మహేంద్రుడు ఉండగా... కెప్టెన్‌గా మరో పేరు తలచుకోవడం చెన్నై అభిమానులకు, ఫ్యాన్స్‌కి నచ్చదు. కానీ ధోనీ అలా ఆలోచించడు. తను లేకపోయినా.. జట్టు విజయాలు కొనసాగాలని అనుకుంటాడు. అందుకే కెప్టెన్‌ ఎంపిక ప్రక్రియ మనసులో మొదలెట్టేసే ఉంటాడు అంటున్నారు పరిశీలకులు. దీనికి చెన్నై జట్టులో వినిపిస్తున్న పేర్లలో రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ, రుతురాజ్‌ గైక్వాడ్‌. వీరిలో జడేజాకే ఛాన్స్‌ ఎక్కువ అని అంటున్నారు. అయితే జడేజాకు ఎక్కువ అవకాశం ఉందంటున్నారు.

ధోనీ

CSK Ravendra Jadeja: చెన్నై ఈ ఏడాది రిటెన్షన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో రవీంద్ర జడేజా ఉన్నాడు. దాని బట్టి అతన్ని ధోనీ ఎంతగా నమ్ముతాడో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ధోనీ తర్వాత జట్టుకు నాయకత్వం వహించే సత్తా ఉన్నది కూడా అతనికే అనుకుంటున్నారు అభిమానులు. సోషల్‌ మీడియాలో ఈ చర్చ మనం చూడొచ్చు. జడేజా గురించి చూస్తే... ఒకప్పటి జడ్డూ వేరు, ఐపీఎల్‌లో రాటుదేలిన జడేజా వేరు అనే చెప్పాలి. కెప్టెన్‌ మనసెరిగి బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేయడం అతని ప్రత్యేకత. ఇలాంటి స్పెషాలిటీలు ఉన్న జడేజాను తర్వాత కెప్టెన్‌ను చేయాలని ధోనీ అనుకుంటున్నాడట. ఈ సీజన్‌లోనే అందుకుతగ్గ ఏర్పాట్లు చేయాలని ధోనీ చూస్తున్నాడట.

CSK Captain Dhoni: చెన్నై సూపర్‌కింగ్స్‌ను ధోనీ వదలడం ఇంత త్వరగా కష్టం కానీ… వచ్చే సీజన్‌కు కెప్టెన్సీకి మాత్రం దూరమవుతాడు అని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. వయసు, కొత్త తరానికి ఛాన్స్‌ ఇవ్వడం లాంటి కారణాలతో ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొని కొత్త కెప్టెన్‌ను తీసుకొస్తాడంటున్నారు. ముందుగా చెప్పుకొన్నట్లు ధోనీ.. ఇలా ఆలోచించడం టీమిండియాలో జరిగింది. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ అయ్యింది ఇలానే. ఆ లెక్కన చెన్నైసూపర్‌కింగ్స్‌లోనూ అదే చేస్తారని టాక్‌. ఈ ఏడాది ఐపీఎల్‌లో జడేజాను ఈ మేరకు సిద్ధం చేసి, 2023 ఐపీఎల్‌లో చెన్నైకి నాయకత్వం వహించేలా చేస్తాడు అని అంటున్నారు. అన్నట్లు జడేజాకు ఇప్పటివరకు కెప్టెన్సీ అనుభవం అయితే లేదు. 2008 అండర్‌ 19 ప్రపంచకప్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా మాత్రం చేశాడు. అయితే కేవలం ప్లాన్‌ ఏతో మాత్రమే వెళ్లడం ధోనీ స్టయిల్‌ కాదు. మైండ్‌లో ప్లాన్‌ బీ, ప్లాన్‌ సీ కూడా ఉంటాయి.

ధోనీ 200వ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సీఎస్కే వేసిన గ్రాఫిక్స్

కాబట్టి రవీంద్ర జడేజా ప్లాన్‌ ఏ అనుకుంటే, మరి మిగిలిన ప్లాన్‌లు ఏంటి అనేది కూడా ఆసక్తికరమే. దానికి వినిపిస్తున్న సమాధానాలు రుతురాజ్‌ గైక్వాడ్‌, దీపక్‌ చాహర్‌. ఇద్దరూ యువకులు కావడం కలిసొచ్చే అంశం. ఎందుకంటే జడేజా వయసు ప్రస్తుతం 33. ఎంతకాదన్నా మరో మూడు, నాలుగేళ్లు బలంగా ఆడతాడు. ఆ సమయానికి మరో కెప్టెన్‌ అవసరం. దానికి తోడు జడేజా గాయపడినా, రెస్ట్‌ అవసరం అనుకున్నా ఇంకో కెప్టెన్‌ కావాలి. కాబట్టి జడేజాతో పాటు మరొకరికి కూడా ధోనీ కెప్టెన్సీ మెలకువలు నేర్పాల్సిందే. అందరూ ఊహించింది చేయడం ధోనీ స్టయిల్‌ కాదు. ఊహించనిది చేసి ఊహలకందని విజయం అందించడం ఆయన నైజం. కాబట్టి... మహేంద్రుడి మనసులో ఏముందో తెలియాలి.

ప్రస్తుత సీజన్​లో సీఎస్కే షెడ్యూల్

ఇదీ చదవండి:'ఫినిషర్​గా ధోనీ ఇక కష్టమే.. ఆ పని చేస్తే బెటర్'

ABOUT THE AUTHOR

...view details