deepika rasangika 161 runs: మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో రికార్డు సృష్టించింది దీపిక రసాంగిక. సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. 38 ఏళ్ల దీపిక.. బహ్రెయిన్ తరఫున బరిలోకి దిగి.. 66 బంతుల్లోనే 161 పరుగులు చేసింది. ఎడాపెడా బౌండరీలతో అలరించింది. ఏకంగా 31 ఫోర్లు కొట్టి.. నాటౌట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా క్రికెటర్ అలిసా హేలీ పేరిట ఉన్న 148 పరుగులే ఇప్పటివరకు మహిళల టీ20లో రికార్డుగా ఉంది. దీన్ని దీపిక బద్దలు కొట్టింది.
రసాంగికతో పాటు బహ్రెయిన్ తరఫున తరంగ గజనాయకే 94(56 బంతుల్లో) పరుగులతో మెరిసింది. వీరిద్దరి విధ్వంసంతో బహ్రెయిన్ 20 ఓవర్లలో 318 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేవలం ఒక్క వికెటే కోల్పోయింది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోరు ఇదే కావడం విశేషం. అయితే, ఒక్క సిక్సు కొట్టకుండానే బహ్రెయిన్ ఈ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 50 ఫోర్లు నమోదయ్యాయి.