టీమ్‌ఇండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌పై పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కానేరియా ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య.. 'న్యూ యూనివర్స్ బాస్' అని, టీ20 క్రికెట్‌లో అతడు ఇప్పటికే క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్‌లను అధిగమించాడని చెప్పాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లోనే 112 పరుగులు చేశాడు. టీ20ల్లో అతడికిది మూడో శతకం. 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుని భారత్ తరఫున వేగవంతమైన శతకం బాదిన రెండో ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ (35 బంతుల్లో) తొలి స్థానంలో ఉన్నాడు.
'సూర్య.. సరికొత్త యూనివర్స్ బాస్'... పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ప్రశంస - సూర్య కుమార్ డానిష్ కనేరియా
స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై మాక్ మాజీ ఆటగాడు ప్రశంసలు కురిపించాడు. సరికొత్త 'యూనివర్స్ బాస్' అతడే అంటూ చెప్పుకొచ్చాడు.
'సూర్యకుమార్‌కు పరిమితులు లేవు. అతడు ప్రతి పరిమితిని అధిగమించాడు. మైదానంలో తన ఆటతీరును ప్రదర్శించాలనే పట్టుదలతో ఉన్నాడు. సూర్యకుమార్ కెరీర్‌ని ఆలస్యంగా ప్రారంభమైంది. కానీ, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. అతడు చాలా కష్టపడి పనిచేస్తాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన ఆటను మైదానంలో ప్రదర్శించాడు. 32 ఏళ్ల వయసులో సూర్యలాంటి ఆటగాడు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాడు. టీ20 క్రికెట్‌లో 'SKY' కొత్త విధానాన్ని పరిచయం చేశాడు. సూర్యకుమార్ ముందు టీ20 దిగ్గజాలైన ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ చిన్న ఆటగాళ్లలా కనిపిస్తున్నారు. అతడిప్పటికే వారిద్దరిని అధిగమించి టీ20 క్రికెట్‌ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. సూర్యకుమార్ శ్రీలంకపై ఆడిన ఇన్నింగ్స్‌ను (51 బంతుల్లో 112 పరుగులు) దానిని ఎవరూ పునరావృతం చేయలేరు' అని కానేరియా వివరించాడు.