Dale Steyn SRH: దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నాడు. టామ్ మూడీ మళ్లీ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ పేలవమైన ప్రదర్శన నేపథ్యంలో చీఫ్ కోచ్ ట్రెవర్ బెయిలీస్, సహాయక కోచ్ బ్రాడ్ హాడిన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సన్‌రైజర్స్‌కు మెంటార్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్.. జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం వల్ల అతని సేవలు కూడా ఫ్రాంచైజీకి దూరమయ్యాయి. దీంతో సన్‌రైజర్స్‌కు పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో మూడీని మళ్లీ చీఫ్ కోచ్‌గా నియమించారు. మూడీ కోచ్‌గా ఉన్నప్పుడే 2016లో సన్‌రైజర్స్ విజేతగా నిలిచింది.
లఖ్‌నవూ కోచ్ రేసులో ఫ్లవర్..
జింజాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ లఖ్‌నవూ ఫ్రాంఛైజీ కోచ్ రేసులో నిలిచాడు. వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఈ ఫ్రాంఛైజీ కొత్తగా బరిలో దిగబోతోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ సహాయక కోచ్ పదవికి రాజీనామా చేసిన ఆండీ.. లఖ్‌నవూ జట్టు కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.
"ప్రస్తుతం చాలా మందితో సంప్రదింపులు జరుపుతున్నాం. కొంతమందితో ఇప్పటికే మాట్లాడాం. ఒప్పందం చేసుకునేంత వరకు ఎవరు కోచ్ అనేది చెప్పలేం" అని లఖ్‌నవూ ఫ్రాంఛైజీ వర్గాలు తెలిపాయి. 2020 ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు సహాయక కోచ్‌గా చేరిన ఫ్లవర్.. గత రెండు సీజన్లలో ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేతో కలిసి పని చేశాడు. 2010లో టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టుకు కూడా ఆండీనే కోచ్. ఫ్లవర్‌తో పాటు టీమ్‌ఇండియా మాజీ కోచ్ కిర్‌స్టెన్, న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ డానియల్ వెటోరి, టీమ్‌ఇండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పేర్లు కూడా లఖ్‌నవూ కోచ్ పదవి రేసులో వినిపిస్తున్నాయి. గోయెంకా సారథ్యంలోని ఆర్‌పీ-ఎస్‌జీ గ్రూప్ రూ.7090 కోట్లతో లఖ్‌నవూ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది.