Indian Spider-Man Subhmann Gill : టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అద్భుతమైన ఆటతీరుతో పరుగులు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇతడు రీసెంట్గా కొత్త అవతారం ఎత్తాడు. తాజా ఐపీఎల్ సీజన్లో అదరగొడుతున్న ఈ గుజరాత్ టైటాన్స్ ఓపెనర్.. సినిమా రంగంలోకి ఇటీవలే అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించే నటుడిగా కాకుండా.. ఓ హాలీవుడ్ యానిమేషన్ చిత్రానికి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారాడు. ఇండియన్ స్పైడర్‌మ్యాన్ పాత్రకు గిల్ తన గాత్రాన్ని అందించాడు. ఆ సినిమా పేరే 'స్పైడర్ మ్యాన్ - ఎక్రాస్ ది స్పైడర్ వర్స్'. అయితే తాజాగా మూవీటీమ్.. ముంబయిలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి.. భారతీయ భాషల్లో దానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. క్రికెటర్ శుభమన్ గిల్ చేత విడుదల చేయించింది. అందులో అతడు పంజాబీ, హిందీ భాషలకు డబ్బింగ్ చెప్పాడు. హాలీవుడ్ ఫ్రాంఛైజీలకు చెందిన ఓ సినిమాలోని ఓ పాత్రకు డబ్బింగ్ చెబుతున్న తొలి క్రీడాకారుడు శుభ్‌మన్ కావడం విశేషమనే చెప్పాలి.
గిల్ స్పైడర్ మ్యాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఇటీవలే హర్షం వ్యక్తం చేశాడు. "స్పైడర్ మ్యాన్ ఎంతో మందికి తెలిసిన ఓ సూపర్ హీరో. ఈ సినిమాతో ఫస్ట్‌టైమ్ ఇండియన్ స్పైడర్‌మ్యాన్‌ను తెరపై చూపించబోతున్నారు. పవిత్ర్ ప్రభాకర్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఎంతో హ్యాపీగా ఉంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నాను" అని గిల్ సంతోషం వ్యక్తం చేశాడు.