ప్రపంచకప్‌నకు భారత జట్టు ఎంపికలో తెలుగు ఆటగాడికి మరోసారి నిరాశే మిగిలింది. నేడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మందిలో అంబటి రాయుడుకు చోటు దక్కలేదు. మొన్నటివరకు భారత వన్డే జట్టులో కీలక సభ్యుడైన తెలుగు ఆటగాడు రాయుడును ప్రపంచకప్‌నకు పక్కనపెట్టింది.
తెలుగు ఆటగాడు ప్రపంచకప్ ఆడి 20 ఏళ్లు.. - ప్రపంచకప్
ఇంగ్లండ్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ జట్టులో తెలుగు ఆటగాడు అంబటి రాయుడుకు చోటు దక్కలేదు. 1999 ప్రపంచకప్‌లో అజహరుద్దీన్ తర్వాత ఇంతవరకు ఏ తెలుగు వ్యక్తి ఈ మెగాటోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు.
సంవత్సర కాలంగా మిడిలార్డర్లో కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు రాయుడు. ఇప్పటివరకు 55 వన్డేలాడి 47 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 10 అర్ధ సెంచరీలున్నాయి. గత ఏడాది ఐపీఎల్ ప్రదర్శన తర్వాత భారత జట్టులోకి వచ్చిన రాయుడు నాలుగో స్థానంలో మంచి ప్రదర్శన చేశాడు. అయితే ఇటీవల సొంతగడ్డపై జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఫలితంగా.. సెలక్టర్లు రాయుడుకు మొండిచేయి చూపారు.
తెలుగు ఆటగాడైన భారతజట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ 1999 ప్రపంచకప్‌లో ఆడాడు. ఆ తర్వాత ఏ తెలుగువ్యక్తికీ ఆ అవకాశం రాలేదు. 2015 ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన 15 మంది జట్టులో రాయుడు పేరు ఉంది. అయితే.. ఆ టోర్నీలో బెంచ్‌కే పరిమితయ్యాడు. ఈ సారి 15 మందిలో కూడా చోటు సంపాదించలేకపోయాడు.