తెలంగాణ

telangana

ETV Bharat / sports

వీడ్కోలు పలికాడా.. పలకాల్సి వచ్చిందా..!

భారత సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడు అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. అయితే ప్రపంచకప్​ జట్టులో చోటు దక్కని రాయుడు స్టాండ్​ బై జాబితాలోనైనా అవకాశం వస్తుందని ఆశించాడు. కానీ పంత్, మయాంక్ అగర్వాల్​ వైపు మొగ్గు చూపింది సెలక్షన్ కమిటీ. ఈ విషయంతో నిరాశ చెందిన రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు.

అంబటి రాయుడు

By

Published : Jul 3, 2019, 7:54 PM IST

అంతర్జాతీయ క్రికెట్​కు అంబటిరాయుడు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. ధావన్, విజయ్ శంకర్ గాయం కారణంగా ప్రపంచకప్​కు దూరమవగా.. వారి స్థానంలో పంత్, మయాంక్ అగర్వాల్​కు చోటు కల్పించింది సెలక్షన్ కమిటీ. నిరాశ చెందిన రాయుడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలుకుతున్నట్టు బీసీసీఐకి మెయిల్ పంపాడు రాయుడు.

"ఈ రోజు ఉదయం మేము రాయుడు మెయిల్ అందుకున్నాం. రిటైర్మెంట్ ప్రకటించినట్టు అందులో పేర్కొన్నాడు. తగిన కారణం అతడు తెలపలేదు. తాను ఆడిన అందరి కెప్టెన్లకు కృతజ్ఞతలు తెలిపాడు" -బీసీసీఐ ప్రతినిధి

బీసీసీఐ కక్ష సాధింపు చర్యా..!

రాయుడు - విజయ్ శంకర్

ప్రపంచకప్​కు 15 మందిని ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ.. రాయుడును జట్టులో తీసుకోలేదు. అతడి స్థానంలో విజయ్ శంకర్​కు చోటు కల్పించింది. విజయ్ శంకర్ 3 డైమెన్షల్ ప్లేయర్ అని చీఫ్ సెలక్టర్ తన ఎంపికను సమర్ధించుకున్నారు. అయితే దీనిపై స్పందించిన రాయుడు.. అయితే 3డీ కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చానని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ఇది కాస్త సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఈ ట్వీట్​ అతడి కెరీర్​పై ప్రభావం చూపింది. స్టాండ్​ బై ఆటగాళ్ల జాబితాలో తన పేరు ఉన్నా.. రిషభ్ పంత్​, మయాంక్ అగర్వాల్​కు చోటు కల్పించిందే తప్ప రాయుడుకు అవకాశమివ్వలేదు. నాలుగో స్థానంలో నిలకడగా ఆడిన రాయుడు ఈ ఏడాది ఒక్క ఆసీస్​ సిరీస్​లోనే విఫలమయ్యాడు. ఇదే సాకుగా చూపి అతడిని వరల్డ్​కప్​లో ఎంపిక చేయనట్లు తెలుస్తోంది.

ప్రపంచకప్​ కోసం ఫస్ట్​క్లాస్​కు గుడ్​ బై ..

శతకం చేసిన రాయుడు

ప్రపంచకప్​నకు సిద్ధమయ్యేందుకు ఫస్ట్​క్లాస్ క్రికెట్​కూ గత నవంబరులో రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ వరల్డ్​కప్​ జట్టులో అతడికి స్థానం దక్కలేదు. 2013లో జింబాబ్వేపై అంతర్జాతీయ వన్డేలో అరంగేట్రం చేసిన రాయుడు 55 మ్యాచ్​ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 47.05 సగటుతో 1655 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 10 అర్ధశతకాలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో 16 శతకాలు, 34 అర్ధ సెంచరీలతో 6151 పరుగులు చేశాడు.

ఈ ఐపీఎలే రాయుడుకు చివరిది..

2010లో ముంబయి ఇండియన్స్​ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన రాయుడు 3300 పరుగులు చేశాడు. అందులో ఓ శతకం, 18 అర్ధసెంచరీలు ఉన్నాయి. 2017 వరకు ముంబయి తరఫున ఆడిన ఈ తెలుగుతేజం 2018 నుంచి చెన్నై సూపర్​ కింగ్స్​కు మారాడు. అదే ఏడాది సీఎస్​కే ఐపీఎల్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్​లో 602 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రాయుడుకు 2019 టోర్నీయే చివరిది.

ఆరంభం నుంచి వివాదాలే..

రాయుడు

ముక్కుసూటిగా మాట్లాడే అంబటి రాయుడుకు తన కెరీర్ ఆరంభం నుంచి వివాదాలే చుట్టుముట్టాయి. 2004 అండర్-19 ప్రపంచకప్​ జట్టుకు కెప్టెన్​గా ఉన్న రాయుడు భారత్​ను సెమీస్ వరకు తీసుకెళ్లాడు. అనంతరం ఫస్ట్ క్లాస్​ క్రికెట్​లో హైదరాబాద్​ క్రికెట్ బోర్డుతో తలెత్తిన వివాదం కారణంగా.. ఆంధ్రా, బరోడా నుంచి ప్రాతినిథ్యం వహించాడు. స్టేట్​ బోర్డుకు ఎదురుతిరిగి ఐసీఎల్​తో మూడేళ్లు ఒప్పందం కుదుర్చుకుని జాతీయ జట్టు చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం చీఫ్ సెలక్టర్ ఎమ్​ఎస్​కే ప్రసాద్, విజయ్ శంకర్​ను ఉద్దేశించి 3డీ గ్లాసెస్ ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details