పాకి్స్థాన్ - కివీస్ మ్యాచ్ హైలెట్స్ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మొదట పాక్ బౌలర్లు సమష్టిగా రాణించగా.. అనంతరం బాబర్ ఆజం శతకంతో కివీస్‌పై పైచేయి సాధించింది. ఫలితంగా టోర్నీలో మొదటిసారి ఓటమిపాలైంది కివీస్.
238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఆదిలోనే ఓపెనర్ ఫకర్ జమాన్ (9) వికెట్ కోల్పోయింది. కాసేపటికే మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (19) పెవిలియన్ చేరాడు. అనంతరం బాబర్ ఆజం, హఫీజ్‌తో కలిసి మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. హఫీజ్ 32 పరుగులు చేసి వెనుదిరిగాడు.
బాబర్, సోహైల్ శతక భాగస్వామ్యం
అనంతరం వచ్చిన హరీస్ సోహాల్, బాబర్ ఆజంతో కలిసి బాధ్యతాయుతంగా ఆడుతూ పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే బాబర్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు హరీస్ సోహైల్ కూడా అర్ధ శతకం సాధించాడు. 68 పరుగులు చేసి సోహైల్ ఔట్ కాగా.. 101 పరుగులతో బాబార్ అజేయంగా నిలిచాడు.
కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫెర్గుసన్, విలియమ్సన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
తడబడిన కివీస్
వర్షం పడి కాస్త ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది కివీస్. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు సాధించింది.
ప్రారంభంలోనే గప్తిల్ (5) వెనుదిరగగా.. మున్రో (12), టేలర్ (3), లాథమ్ (1) విఫలమయ్యారు. సారథి విలియమ్సన్తో కలిసి నీషమ్ కాసేపు వికెట్ పడకుండా కాపాడారు. ఐదో వికెట్‌కు 37 పరుగులు జోడించిన అనంతరం విలియమ్స్‌న్ (41)ను షాదాబ్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి మరోసారి కష్టాల్లో పడింది కివీస్.
మెరిసిన నీషమ్, గ్రాండ్‌హోమ్
పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న నీషమ్, గ్రాండ్‌హోమ్‌లు అర్ధసెంచరీలు సాధించారు. ఆరో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం 48 ఓవర్లో అనవసర పరుగుకు యత్నించి గ్రాండ్‌హోమ్ (64) రనౌట్‌గా వెనుదిరిగాడు. నీషమ్ 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. మొహమ్మద్ ఆమిర్, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఇది చదవండి: క్రిస్ గేల్ వీడ్కోలు పలికేది అప్పుడే..!