భారత్‌తో ఓటమి తర్వాత అనూహ్యంగా పుంజుకున్న పాకిస్థాన్ జట్టుతో అఫ్గానిస్థాన్‌తో నేడు తలపడనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్కువేదిక హెడింగ్లేలోని లీడ్స్ మైదానం.
పాకిస్థాన్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించింది. రెండింటిలో ఓడిపోగా మరో రెండు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు పాకిస్థాన్ గెలుపు ఓటములను పరిశీలిస్తే 1992 ప్రపంచకప్ గుర్తుకు తెస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని అప్పటి పాక్ జట్టు మొదట పేలవంగా ఆడి తిరిగి పుంజుకుని కప్‌ను ఎగరేసుకుపోయింది.
పాక్‌కు కీలకం
భారత్‌తో భారీ ఓటమితో పాకిస్థాన్ ఆటతీరుపై సీనియర్ ఆటగాళ్లతో సహా అనేక మంది విమర్శలు చేశారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీస్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది. ఈ నేపథ్యంలో పాక్ సెమీస్ చేరాలంటే అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిందే.
బలాబలాలు
హరీస్ సొహైల్, బాబర్ ఆజమ్ తిరిగి ఫామ్‌లోకి రావటం పాక్ బ్యాటింగ్‌కు కలిసొచ్చే అంశం. బౌలర్లు షహీన్ అఫ్రిదీ, ఆమిర్‌లతో పాక్ పేస్ విభాగం పటిష్ఠంగా ఉంది. అయితే భారత్‌తో మ్యాచ్‌లో అఫ్గాన్ పోరాట పటిమ కనబరిచి అందరి మనసులను కొల్లగొట్టింది. రషీద్ ఖాన్, నాయిబ్‌లకు అడ్డుకట్ట వేయగలిగితే పాకిస్థాన్ గెలుపు నల్లేరుపై నడకే.
ఇదీ చూడండి: లంకేయులపై సఫారీల ఘనవిజయం