తెలంగాణ

telangana

ETV Bharat / sports

జడేజా, ధోనీ వీరోచిత ఇన్నింగ్స్​ వృథా... ఫైనల్లో కివీస్​

మాంచెస్టర్ వేదికగా భారత్​తో జరిగిన ప్రపంచకప్​ సెమీస్​ మ్యాచ్​లో కివీస్ విజయం సాధించింది. టీమిండియా బ్యాట్స్​మెన్ జడేజా(77), ధోని(50) రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. 3 వికెట్లతో ఆకట్టుకున్న న్యూజిలాండ్​ బౌలర్​ హెన్రీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​ అవార్డు దక్కింది.

జడేజా, ధోనీ వీరోచిత ఇన్నింగ్స్​ వృథా

By

Published : Jul 10, 2019, 7:58 PM IST

Updated : Jul 10, 2019, 11:44 PM IST

ఇండియా - న్యూజిలాండ్ మ్యాచ్ హైలెట్స్​

2015 ప్రపంచకప్​ సెమీస్​ మ్యాచ్​లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయాన్నందుకున్న న్యూజిలాండ్ అదే రీతిలో నేడు భారత్​పై గెలిచింది. ఈ విజయంతో కివీస్​ రెండోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. భారత్​తో జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో నెగ్గింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్ 221 పరుగులకు ఆలౌటైంది. జడేజా(77), ధోని(50) పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ మ్యాచ్​ను గెలిపించలేకపోయారు. మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, బౌల్ట్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 3 వికెట్లతో ఆకట్టుకున్న హెన్రీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'​ అవార్డు దక్కింది.

టాపార్డర్ టపాటపా...

240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్​కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్(1), కోహ్లీ(1), రాహుల్(1) వికెట్లను వరుసగా చేజార్చుకుంది. రెండో ఓవర్లోనే రోహిత్ శర్మను ఔట్ చేశాడు హెన్రీ, కాసేపటికే విరాట్ కోహ్లీని పెవిలియన్ చేర్చాడు బౌల్ట్​. తర్వాతి ఓవర్లోనే రాహుల్​ను వెనక్కి పంపాడు హెన్రీ. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కోహ్లీ సేన.

నిలకడగా ఆడిన పంత్ - పాండ్య..

కాసేపు దినేశ్ కార్తీక్​ - పంత్ నిలకడగా ఆడారు. అయితే నీషమ్ అద్భుత క్యాచ్​తో కార్తీక్(6) ఔట్ అయ్యాడు. అనంతరం పంత్(32), పాండ్య(32) జోడి నిలకడగా ఆడింది. స్కోరు వేగంగా కదలకపోయినా.. వికెట్ పడకుండా క్రీజులో పాతుకుపోయారు. అయితే సాంట్నర్ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించిన పంత్(32) బౌండరీలైన్లో గ్రాండ్​హోమ్​కు క్యాచ్ ఇచ్చాడు. కాసేపటికే పాండ్య కూడా అదే రీతిలో సాంట్నర్ బౌలింగ్​లోనే పెవిలియన్ చేరాడు.

జడ్డూ అర్ధశతకం వృథా..

పాండ్య ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా వేగంగా ఆడాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. మరోవైపు ధోని స్ట్రైక్​ రొటేట్ చేస్తూ జడ్డూకు సహకరించాడు. సాంట్నర్ బౌలింగ్​లో సిక్సర్లతో విరచుకు పడ్డాడు జడేజా. 59 బంతుల్లోనే 77 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ చివర్లో ధాటిగా ఆడుతూ బౌల్ట్ బౌలింగ్​లో విలియమ్సన్​ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

మలుపు తిప్పిన ధోని రనౌట్​..

జడేజా ఔటైనా..క్రీజులో ధోని ఉండటంతో గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. అప్పుడు భారత్​ గెలవాలంటే 12 బంతుల్లో 31 పరుగులు చేయాలి. 49వ ఓవర్లో సిక్సర్​తో బ్యాట్ ఝుళిపించిన మహీ.. అనంతరం రనౌటయ్యాడు. మూడో బంతికి షాట్ ఆడిన ధోని ఒక్క పరుగు పూర్తి చేశాడు. రెండో రన్​ దాదాపు పూర్తవుతుండగా గప్తిల్ వేసిన త్రో వికెట్లను నేరుగా తాకింది. ధోని పెవిలియన్ చేరాడు. అనంతరం భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు.

నిన్న వర్షం కారణంగా వాయిదా పడిన సెమీస్​ మ్యాచ్ బుధవారం కొనసాగింది. 46.1 ఓవర్లలో 211 పరుగులు చేసిన కివీస్ మరో 28 పరుగులు మాత్రమే జత చేయగలిగింది. రాస్ టేలర్(74), విలియమ్సన్(67) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు తీయగా.. మిగతా వారు తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Last Updated : Jul 10, 2019, 11:44 PM IST

ABOUT THE AUTHOR

...view details