ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. కంగారూ జట్టుకు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ 316 పరుగులకు ఆలౌటైంది. కంగారూ బ్యాట్స్‌మెన్ స్మిత్ (69), వార్నర్ (56), అలెక్స్ (55) అర్ధశతకాలు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్ చెరో 3 వికెట్లు, చాహల్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు.
శతకంతో ఆకట్టుకున్న శిఖర్ ధావన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు' దక్కింది.
353 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆరంభంలో కాస్త దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు ఫించ్ (36), డేవిడ్ వార్నర్ 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 14వ ఓవర్లో ఫించ్ రనౌట్ కాగా.. అనంతరం స్మిత్, వార్నర్ నిలకడగా ఆడారు. వీరిద్దరూ 72 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. డేవిడ్ వార్నర్‌ను ఔట్ చేసి చాహల్ ఈ జోడిని విడదీశాడు.
తర్వాత ఖవాజాతో కలిసి స్కోరు వేగం పెంచాడు స్మిత్. ఈ క్రమంలో స్మిత్ 60 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. వేగంగా ఆడుతూ బుమ్రా బౌలింగ్‌లో ఖవాజా ఔటయ్యాడు. అనంతరం వచ్చిన మ్యాక్స్‌వెల్ ధాటిగా ఆడాడు. వరుసగా బౌండరీలు కొడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. 14 బంతుల్లో 28 పరుగులు చేశాడు మ్యాక్స్‌వెల్.