విశ్వసమరంలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు నేడు లీడ్స్ వేదికగా శ్రీలంకతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. వరుస విజయాలతో ఇప్పటికే సెమీస్‌కు చేరిన భారత్‌ను... మిడిలార్డర్ సమస్య వేధిస్తోంది. శ్రీలంకతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లోనైనా ఈ సమస్యను అధిగమించాలని టీమిండియా భావిస్తుంది. మరోవైపు లంకేయులు విజయంతో టోర్నీకి ముగింపు పలకాలని చూస్తోంది.
భారత మి'డల్' ఆర్డర్:
బ్యాటింగ్‌లో శుభారంభాలు దక్కుతున్నా భారీ స్కోరు సాధించడంలో విఫలం అవుతోంది కోహ్లీ సేన. కీలకమైన సెమీస్‌కు ముందు అన్ని విభాగాల్లో రాణించాలని కోరుకుంటుంది. మిడిలార్డర్‌లో ధోని ప్రదర్శన ఆందోళన పరుస్తుండగా... సెమీస్‌కు ముందు అతడు ఫామ్‌లోకి రావాలని జట్టు కోరుకుంటుంది.
- రోహిత్‌శర్మ, రాహుల్, కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో బుమ్రా, షమీ, భువనేశ్వర్ రాణిస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.
- లంక పేస్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటారనే దానిపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ పోరుకు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని భావిస్తోంది భారత్.
లంక పరువు కోసం:
లంక జట్టు ఈ ప్రపంచకప్‌లో రాణించినా వరుణుడు వల్ల ఆ జట్టు సెమీస్ అవకాశాలు దెబ్బతిన్నాయి. 8 మ్యాచ్‌లాడిన లంక 3 మ్యాచ్‌ల్లో గెలిచి మరో మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. ఇప్పటికే సెమీస్ నుంచి నిష్క్రమించిన లంక చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తుంది.
- లసిత్ మలింగ, ధనంజయ డిసిల్వా బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నా... స్థిరత్వం లేకపోవడం ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది. గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై చెలరేగిన లంక బ్యాట్స్‌మెన్ 338 పరుగుల భారీ స్కోరు సాధించారు.
- ఏంజెలో మాథ్యూస్, ఆవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండీస్ బ్యాట్‌తో అదరగొడుతున్నారు. మలింగా, ధనంజయ డిసిల్వా, ఉదాన బంతితో మెరిస్తే టీమిండియాకు గట్టిపోటీ ఎదురవుతుంది.