ఈ ప్రపంచకప్‌లో ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత అసలు సిసలు మజా కలిగించే మ్యాచ్ నేడు జరగనుంది. ఈ టోర్నీలో ఓటమి లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్ ఓ వైపు... హాట్ ఫేవరేట్‌గా బరిలో దిగి తడబడుతోన్న ఇంగ్లాండ్ మరోవైపు. ఈ రెండింటి మధ్య నేడు బర్మింగ్‌హామ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
గెలిస్తే సెమీస్‌కు కోహ్లీసేన..
ఓటమి లేకుండా మెరుపు విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో ఆసక్తికర మ్యాచ్‌కు సన్నద్ధమైంది. అఫ్గాన్‌తో మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్‌లన్నింటిలోనూ సునాయాసంగా నెగ్గిన భారత్ ఆతిథ్య జట్టుపై పై చేయి సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలనుకుంటోంది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగుల భారీ విజయాన్ని అందుకున్న కోహ్లీసేన మరోసారి అదే ప్రదర్శన చేయాలని భావిస్తోంది.
ఆరెంజ్ ఆర్మీగా మారుతున్న మెన్ ఇన్ బ్లూ ..
నిర్ణిత ఓవర్ల ఫార్మాట్లో నీలి రంగు జెర్సీల్లో తప్ప మరే ఇతర దుస్తుల్లో టీమిండియాను అభిమానులు చూసుండరు. అయితే తొలిసారిగా కాషాయ రంగు దుస్తుల్లో కనిపించనుంది కోహ్లీసేన. ఇంగ్లీషు జట్టు కూడా నీలిరంగు జెర్సీల్లోనే మ్యాచ్‌లు ఆడుతున్న కారణంగా టీమిండియా కాషాయరంగు దుస్తుల్లో నేటి మ్యాచ్‌లో ఆడనుంది.
రోహిత్ శర్మ వరుసగా రెండు మ్యాచుల్లో విఫలమైన నేపథ్యంలో ఈసారి అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు అభిమానలు. వరుసగా అర్ధశతకాలు చేస్తూ మంచి ఫామ్‌లో ఉన్నాడు కోహ్లీ. రాహుల్, పాండ్య నిలకడగా రాణిస్తున్నారు. బౌలింగ్‌లో భువి స్థానాంలో వచ్చిన షమీ రెచ్చిపోతున్నాడు. ఆడిన రెండు మ్యాచుల్లో 8 వికెట్లు తీశాడు. అందులో ఓ హ్యాట్రిక్ ఉంది. భారత స్టార్ పేసర్ బుమ్రా తన దైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు.
వదలని నాలుగో నెంబర్ తలనొప్పి..
నాలుగో నెంబర్ సమస్య టీమిండియాను పట్టిపీడిస్తోంది. ధావన్ జట్టు నుంచి వైదొలిగిన దగ్గరి నుంచి రాహుల్ ఓపెనర్‌గా ఆడుతున్నాడు. దీని వల్ల నాలుగో స్థానంలో నిలకడగా ఆడే ఆటగాడు కరువయ్యాడు. రెండు మ్యాచుల్లో 4వ స్థానంలో ఆడిన విజయ్ శంకర్ ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లో ఒకరికి చోటు ఇవ్వాలంటూ పలువురు అభిప్రాయపడ్డారు. అయితే కోహ్లీ మళ్లీ విజయ్ శంకర్ వైపే మొగ్గు చూపిస్తున్నాడనిపిస్తోంది. విజయ్ నుంచి త్వరలో భారీ ఇన్నింగ్స్ చూడబోతున్నారంటూ విరాట్ చెప్పడమే అందుకు కారణం. నెమ్మదిగా ఆడుతున్నాడంటూ ధోనీపై విమర్శలు వస్తున్నాయి. మిడిల్ ఆర్డర్లో స్ట్రైక్ రొటేట్ చేయాల్సిన బాధ్యత అతడిపై ఉందంటూ క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
ఓడితే ఇంగ్లాండ్‌కు సెమీస్ అవకాశాలు సంక్లిష్టం..
ఎన్నో అంచనాల మధ్య యుద్ధంలో దిగిన సైనికుడు తొలి దెబ్బకే పలాయనం చెందినట్టు.. ప్రపంచకప్ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగిన ఇంగ్లాండ్‌కు సెమీస్ అవకాశమే ప్రమాదంలో పడేట్టు ఉంది. వరుసగా శ్రీలంక, ఆస్ట్రేలియాపై పరాజయం చెందిన ఇంగ్లీష్ జట్టు నాలుగు విజయాలతో పాయిట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ముఖ్యంగా శ్రీలంకపై 233 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. చిరకాల ప్రత్యర్థి ఆసీస్‌తో మ్యాచ్‌లోనూ 286 పరుగులు చేయలేక 221కే ఆలౌటైంది.
ఏడు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్ నాలుగింటిలో మాత్రమే గెలిచింది. గత రెండు మ్యాచుల్లో టాప్ఆర్డర్ విఫలం కావడం.. జట్టు సమష్టిగా రాణిచకపోవడం లాంటి సమస్యలు ఇంగ్లాండ్‌ను వేధిస్తున్నాయి. ఫ్లాట్ పిచ్‌లపై సత్తాచాటుతున్న ఆతిథ్య జట్టు.. పిచ్ కొంచెం స్వింగ్‌కు సహకరిస్తుంటే వెంటనే తేలిపోతోంది. వారికి అనుకూలించే పిచ్‌లపై తప్ప మిగతా వాటిలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు.
మిడిల్ ఆర్డర్లో స్టోక్స్, మోర్గాన్ నిలకడగా ఆడుతున్నారు. గాయం కారణంగా దూరమైన జేసన్‌రాయ్ ఈ రోజు మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. రాయ్ రావడం జట్టుకు కలిసొచ్చే అవకాశముంది. బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్ - 10 బౌలర్ల జాబితాలో ఇద్దరు ఇంగ్లీష్ బౌలర్లకు చోటు దక్కడం విశేషం. జోఫ్రా ఆర్చర్ 16 వికెట్లతో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో 4వ స్థానంలో ఉన్నాడు. మార్క్‌వుడ్ 13 వికెట్లతో 6వ స్థానంలో ఉన్నాడు.
ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న పాకిస్థాన్.. ఇంగ్లాండ్‌ను వెనక్కినెట్టి టాప్ -4కు చేరింది. దీంతో ఇంగ్లాండ్‌కు సెమీస్ బెర్తు మరింత ప్రమాదకరంగా మారనుంది. టాప్-4లో నిలవాలంటే ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో గెలవక తప్పదు.
ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లాండ్ ఏడు సార్లు తలపడగా.. చెరో మూడు మ్యాచుల్లో నెగ్గాయి. ఓ మ్యాచ్ టై అయింది. ఇరు జట్లు 99 వన్డేలాడితే టీమిండియా 53 మ్యాచుల్లో గెలిచింది. ఇంగ్లాండ్ 41 మ్యాచుల్లో నెగ్గగా.. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
ఇది చదవండి: 157కే కుప్పకూలిన కివీస్..ఆసీస్‌కు మరో గెలుపు