ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులుగా పోరాడే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ నేడు జరగనుంది. లార్డ్స్ వేదికగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. రెండు జట్లు ఒకే మ్యాచ్‌ను కోల్పోయినా... వరుస విజయాలతో టోర్నీలో దూసుకుపోతున్న ఆసీస్ జట్టే ఫేవరేట్ అని విశ్లేషకులు అంటున్నారు.
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి మినహా టోర్నీలో ఆస్ట్రేలియా బాగా రాణించింది. ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించడం వల్ల ఆరోన్ ఫించ్ సేన మరింత విజృంభించే అవకాశం ఉంది. మరోవైపు న్యూజిలాండ్ బలంగానే ఉన్నప్పటికీ పాకిస్థాన్ మ్యాచ్‌తో ఓటమి కారణంగా ఆత్మవిశ్వాసం లోపించినట్టు కనిపిస్తుంది.
ఓటమికి ప్రతీకారం
న్యూజిలాండ్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 11 పాయింట్లతో సెమీస్ రేసులో ముందంజలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి గెలిచినా సెమీస్ బెర్త్ ఖాయమే. అయితే 2015 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ప్రపంచకప్‌ను చేజార్చుకుంది కివీస్ జట్టు. ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
ఆసీస్‌దే పైచేయి
విదేశీ వేదికల్లో న్యూజిలాండ్‌పై ఆసీస్‌దే ఆధిపత్యం. 20 వన్డేలు ఆడగా 19 మ్యాచ్‌ల్లో ఆసీస్ విజయం సాధించింది. 1999 ప్రపంచకప్ మ్యాచ్‌లో మాత్రం న్యూజిలాండ్ గెలిచింది. ప్రపంచకప్ టోర్నీల్లో చూస్తే 6-1తో ఆసీస్‌దే పైచేయి.
బలాబలాలు
ఈ టోర్నీలో అత్యధిక పరుగుల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఫించ్, డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ప్రపంచకప్ టోర్నీల్లోనే అత్యుత్తమ ఓపెనింగ్ జంటగా కొనసాగుతున్నారీ విధ్వంసకర బ్యాట్స్‌మెన్. మరోవైపు మిచెల్ స్టార్క్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. 19 వికెట్లతో మొదటిస్థానంలో నిలిచిన ఈ ఫాస్ట్ బౌలర్ కివీస్ బ్యాట్స్‌మెన్‌కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
కేన్ విలియమ్సన్పైనే కివీస్ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో విలియమ్సన్ ఒక్కడే ఆసీస్‌పై శతకంతో రాణించాడు. మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియాపై 12 వన్డేల్లో 48 సగటుతో 416 పరుగులు చేశాడీ కివీస్ సారథి. ఆసీస్‌ను ఓడించాలంటే కవీస్ సమష్టిగా రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఇదీ చూడండి: 'మా ప్రదర్శనపై సిగ్గుపడుతున్నాం.. క్షమించండి'