కొన్ని సార్లు అంపైర్ నిర్ణయాలు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాయి. అదేదో మామూలు సిరీస్లోనో అయితే ఎలా ఉండేదో కానీ.. ప్రపంచకప్ మ్యాచ్లో అలాంటి పొరపాటు జరిగితే ఎలా ఉంటుంది? అదీ ఫైనల్ మ్యాచ్ అయితే...?
ఇటీవలే ముగిసిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో అంపైర్ ధర్మసేన.. ఓవర్త్రోకు ఆరు పరుగులివ్వగా ఇదే న్యూజిలాండ్ ఓటమికి కారణమైందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు ఇదే విషయంపై అంపైర్ ధర్మసేన స్పందిస్తూ.. తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. కానీ అందుకు చింతించడం లేదన్నాడు. 'ఇది తాను చేసిన అతి పెద్ద తప్పిదమని టీవీ రీప్లేలో చూసిన తర్వాత కానీ అర్థం కాలేదని' అన్నాడు.
"నా నిర్ణయంలో తప్పు ఉందని ఒప్పుకుంటున్నా. కానీ అందుకు చింతించడం లేదు. టీవీ రీప్లేలో చూసి కామెంట్ చేయడం సులువే. కానీ మైదానంలోకి వచ్చేసరికి పరిస్థితి వేరు. మా దగ్గర సరైన టీవీ రీప్లే లేనందునే ఆరు పరుగులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌కు సంబంధించిన అధికారులతో చర్చించిన తర్వాత ఆరు పరుగులుగా ప్రకటించా. లెగ్ అంపైర్ ఎరాస్మస్‌తోనూ మాట్లాడా. బ్యాట్స్‌మన్ రెండో పరుగును పూర్తి చేశాడని భ్రమపడి ఆ త్రోకు అదనంగా మరో నాలుగు పరుగులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దానిని మ్యాచ్ అధికారులు రీప్లేలో చూడకపోయినందున పొరపాటు జరిగింది"
-ధర్మసేన, అంపైర్
ఈ నిర్ణయాన్ని మాజీ అంపైర్లు సైమన్ టౌఫెల్, హరిహరన్ తప్పుబట్టారు. ఓవర్ త్రోకు ఆరు పరుగులు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.