భారత జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని నేడు 38వ ఏటలోకి అడుగుపెడుతున్నాడు. మహి జన్మదినోత్సవం సందర్భంగా కెప్టెన్ కూల్ గురించి కొన్ని విశేషాలు మీకోసం..
నేపథ్యం..
'కెప్టెన్ కూల్' మహేంద్ర సింగ్ ధోని... జులై 7, 1981న ఝార్ఖండ్‌లోని రాంచీలో జన్మించాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మహికి... చిన్నప్పటి నుంచే ఆటలంటే మక్కువ. యుక్త వయసులో ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్‌పై మొగ్గుచూపిన ధోని... తర్వాత క్రికెట్లో అడుగుపెట్టి అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు.
ఆరంగేట్రం...
దేశవాళీ క్రికెట్లో ధోని బిహార్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేవాడు. ఇండియా-ఎ తరఫున తొలి సెంచరీ సాధించాడు. తర్వాత కెన్యా, జింబాబ్వేలపై మంచి ప్రదర్శన కనబరిచాడు. ధోని ప్రతిభను గుర్తించిన అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ... బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ఎంపిక చేశాడు. ఆ విధంగా 2004లో డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌పై తొలి అంతర్జాతీయ వన్డే ఆడాడు ధోని. కాని ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా నిరాశపరిచాడు. తర్వాత 2005లో శ్రీలంకతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 183 పరుగులు చేశాడు. 2006లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌తో పొట్టి క్రికెట్లో అడుగు పెట్టాడు.
తిరుగులేని నాయకుడు..
కెరీర్ ఆరంభం నుంచే తనదైన నాయకత్వంతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు ధోని. 2011లో వన్డే ప్రపంచకప్, 2007లో టీ20 వరల్డ్‌కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోపీ అతడి సారథ్యంలోనే టీమిండియా గెలిచింది. ఈ మూడు విభాగాల్లో జట్టును విజేతగా నిలిపిన ఘనత ధోనిదే. ఇప్పటివరకు ఏ దేశ సారథి మొత్తం ఈ మూడు టైటిల్స్‌ను గెలవలేదు. అంతేకాదు 1983లో భారత్ ప్రపంచకప్ గెలిచిన తర్వాత మళ్లీ 28 ఏళ్లకు రెండోసారి వరల్డ్‌కప్ తెచ్చిన సారథి ధోని.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించిన ధోని.. ఆ జట్టును ఎనిమిది సార్లు ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అందులో మూడుసార్లు విజేతగా నిలిచింది.
రికార్డులు...