తెలంగాణ

telangana

ETV Bharat / sports

షకిబ్​ అదరహో... బంగ్లా సెమీస్​ ఆశలు సజీవం - afg vs ban

సౌతాంప్టన్​ వేదికగా అఫ్గానిస్థాన్​తో జరిగిన ప్రపంచకప్​ మ్యాచ్​లో బంగ్లాదేశ్ తిరుగులేని ప్రదర్శన చేసింది. ఫలితంగా 62 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. చక్కటి ఆటతీరుతో మెప్పించిన షకిబ్​ 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్'​ అందుకున్నాడు. ఈ గెలుపుతో సెమీస్​ అవకాశాలు మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో టాప్​ 5లోకి దూసుకెళ్లింది బంగ్లాదేశ్​.

షకిబ్​ అదరహో... సెమీస్​ రేసులో మెరుగైన బంగ్లా

By

Published : Jun 25, 2019, 12:15 AM IST

Updated : Jun 25, 2019, 1:30 AM IST

షకిబ్​ అదరహో... బంగ్లా సెమీస్​ ఆశలు సజీవం

ప్రపంచకప్​లో భాగంగా సోమవారం అఫ్గానిస్థాన్​​తో జరిగిన మ్యాచ్​లో బంగ్లాదేశ్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సౌతాంప్టన్​ వేదికగా జరిగిన ఈ పోరులో 263 పరుగుల లక్ష్యంతో దిగిన అఫ్గాన్​ జట్టు... నిర్ణీత 50 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. 5 వికెట్లు పడగొట్టిన షకిబ్...​ బంగ్లా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తాజా విజయంతో మొత్తం 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది బంగ్లా.

పాయింట్ల పట్టిక

టైటిల్​ ఫేవరెట్లుగా బలమైన ఆటగాళ్లతో బరిలోకి దిగిన జట్లు ఓ పక్క ఇంటిముఖం పడుతుంటే... పసికూనగా, అంతంత మాత్రం అంచనాలతో బరిలోకి దిగిన బంగ్లా సెమీస్​ పోరులో నిలిచింది. ప్రత్యర్థి అఫ్గాన్​కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అని విభాగాల్లోనూ చక్కటి ప్రదర్శన చేసింది.

  • తొలుత బ్యాటింగ్​ చేసిన బంగ్లాదేశ్​ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. బంగ్లా కీపర్​ ముష్ఫికర్​ రహీమ్​ (83), షకిబ్​ ఉల్ హసన్​ (51) సత్తా చాటారు. అఫ్గాన్​ బౌలర్లలో ముజిబ్​ రహ్మాన్​ 3, నయీబ్​ 2 వికెట్లతో రాణించారు.
  • షిన్వారీ ఒంటరి పోరాటం..

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్​ జట్టు 50 ఓవర్లలో 200 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లుగా వచ్చిన అఫ్గాన్​ సారథి గుల్బాదిన్​ నయీబ్​ 47 పరుగులు(75 బంతుల్లో; 3 ఫోర్లు), రహ్మత్​ షా 24 పరుగులు చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. కాని కీలక సమయంలో గుల్బాదిన్, హస్మతుల్లా (11), ఆస్గర్​ (20) ఔటయ్యారు. భారత్​ మ్యాచ్​లో సత్తా చాటిన నబీ.. షకిబ్​ బౌలింగ్​లో బౌల్డ్​ అయి డకౌట్​గా పెవిలియన్​ చేరాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా షిన్వారీ 49 పరుగులు (51 బంతుల్లో ; 3ఫోర్లు, ఒక సిక్సర్​) సాధించి చివరి వరకు క్రీజులో నిలిచాడు. నజీబుల్లా (23) చివర్లో కొంత సహకారం అందించినా ఫలితం దక్కలేదు.

షకిబ్​ ఆల్​రౌండర్​ ప్రదర్శన...

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది బంగ్లా. ఓపెనర్​ లిటన్​ దాస్​ (16) త్వరగా ఔటైనా... తమీమ్​, బంగ్లాదేశ్​ ఆల్​రౌండర్ షకిబ్​ ఉల్​ హసన్ (51)​విలువైన ఇన్నింగ్స్​ ఆడారు. తమీమ్​తో కలిసి రెండో వికెట్​కు 59 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు షకిబ్​. ఈ ప్రపంచకప్​లో ఆడిన ఆరు మ్యాచ్​ల్లో అయిదో అర్ధశతకం తన ఖాతాలో వేసుకొని టాప్​ స్కోరర్​గా కొనసాగుతున్నాడు షకిబ్​.

షకిబ్​ బౌలింగ్​ గణాంకం

బౌలింగ్​లోనూ రాణించిన షకిబ్​ 10 ఓవర్లు వేసి 29 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లు సాధించాడు. ఆల్​రౌండర్​గా రాణించి 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్' అవార్డు​ గెలుచుకున్నాడు.

బంగ్లా బ్యాటింగ్​లో ముష్ఫికర్​ రహీమ్​ అద్భుతమైన ఇన్నింగ్స్​ ఆడాడు. 87 బంతుల్లో 83 పరుగులతో జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొసాద్దిక్ (35 నాటౌట్​) చివర్లో బ్యాట్​ ఝుళిపించడం వల్ల 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగుల స్కోరు సాధించింది బంగ్లా.

అర్ధశతకంతో రాణించిన ముష్పికర్​

అఫ్గాన్​ బౌలర్లలో ముజిబ్​ రహ్మాన్​ 3, నయీబ్​ 2 వికెట్లతో రాణించారు. నబీ, జద్రాన్​కు తలో వికెట్​ ఖాతాలో వేసుకున్నారు.

రికార్డులు...

  1. ప్రపంచకప్​లో బంగ్లా తరఫున అత్యుత్తమ​ బౌలింగ్​ గణాంకాలు నెలకొల్పాడు షకిబ్​. 29 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
  2. మెగాటోర్నీ​లో అత్యుత్తమ స్పిన్నర్ల జాబితాలో 6వ స్థానం సంపాదించాడు షకిబ్​.
  3. వన్డేల్లో 5/29 ప్రదర్శనతో సత్తా చాటిన రెండో బంగ్లా బౌలర్​గా రికార్డు సృష్టించాడు.
  4. వన్డేల్లో వ్యక్తిగతంగానూ షకిబ్​కు ఇదే అత్యుత్తమం. గతంలో జింబాబ్వేపై 5/47 అత్యుత్తమం సాధించాడు.
  5. ప్రపంచకప్​ కెరీర్​లో​ 1000 పరుగుల పూర్తి చేసిన తొలి బంగ్లా ఆటగాడిగా షకిబ్​ రికార్డులకెక్కాడు.
  6. మొత్తంగా ఈ మార్కు అందుకున్న వారిలో 19వ ఆటగాడు షకిబ్​.
  7. ప్రస్తుత టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న వార్నర్​ను వెనక్కి నెట్టాడు షకిబ్(476).
  8. మెహిదీ హసన్​,గుల్బాదిన్​ వన్డేల్లో వేయి పరుగులు పూర్తి చేసుకున్నారు.
Last Updated : Jun 25, 2019, 1:30 AM IST

ABOUT THE AUTHOR

...view details