తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: స్టార్క్​ దెబ్బకు విండీస్ పరాజయం - australia

నాటింగ్ హామ్​ వేదికగా వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో ఆస్ట్రేలియా 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టార్క్​ 5 వికెట్లతో రాణించగా... కమిన్స్​ రెండు, జంపా ఓ వికెట్ తీసుకున్నారు. విండీస్​ బ్యాట్స్​మెన్  షాయ్ హోప్​(68), హోల్డర్​ అర్ధశతకాలు చేశారు.

ఆస్ట్రేలియా గెలుపు

By

Published : Jun 6, 2019, 11:59 PM IST

వెస్టిండీస్​తో జరిగిన ప్రపంచకప్​ మ్యాచ్​లో ఆస్ట్రేలియా 15 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది విండీస్. ఆస్ట్రేలియా 289 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్​కు దిగింది విండీస్. కరీబీయన్​ బ్యాట్స్​మెన్ షాయ్​ హోప్(68)​, హోల్డర్​(51) అర్ధశతకాలతో ఆకట్టుకున్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. నాటింగ్​హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ఆసీస్​ బౌలర్ స్టార్క్ ఐదు వికెట్లతో విజృంభించగా... కమిన్స్​ రెండు, ఆడమ్ జంపా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

92 పరుగులతో ఆకట్టుకున్న ఆసీస్ ఆటగాడు నాథన్ కౌల్టర్​నైల్​కు 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

289 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన విండీస్​కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ లూయిస్(1).. స్టార్క్ బౌలింగ్​లో ఔటయ్యాడు. కాసేపటికీ క్రిస్​ గేల్​ను(21) పెవిలియన్ చేర్చాడు కమిన్స్​. అనంతరం నీకోలస్ పూరన్(40), షాయ్ హోప్ జోడి నిలకడగా ఆడింది. వీరిద్దరూ 68 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. పూరన్​ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు జంపా.

షాయ్ హోప్, హోల్డర్​ అర్ధశతకాలు..

పూరన్ ఔటైన తర్వాత హోప్, హోల్డర్​ నిలకడగా ఆడారు. హోప్ ఆచితూచి ఆడగా.. హోల్డర్ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. 68 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్​లో హోప్ ఔటయ్యాడు. అనంతరం వచ్చిన రసెల్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో స్టార్క్ బౌలింగ్​లో మ్యాక్స్​వెల్​కు క్యాచ్ ఇచ్చాడు. అర్ధశతకం పూర్తి చేసి హోల్డర్​ కూడా ఔటయ్యాడు. వేగంగా 150 వికెట్లు తీసిన ఆటగాడిగా స్టార్క్ ఘనత సాధించాడు. 77 మ్యాచ్​ల్లోనే ఈ రికార్డు అందుకున్నాడు.

ఐదు వికెట్లు తీసిన స్టార్క్​

ప్రమాదకరంగా మారుతున్న రసెల్​​ను(15) ఔట్ చేసి మ్యాచ్​ను మలుపు తిప్పాడు స్టార్క్​. అనంతరం ఓకే ఓవర్లో బ్రాత్​వైట్​(16), హోల్డర్​ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం షెల్డాన్ కాట్రెల్​ను(1) కూడా ఔట్ చేసి ఈ ప్రపంచకప్​లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్​గా రికార్డు సాధించాడు స్టార్క్​.

హోల్డర్​ ఔటైన తర్వాత విండీస్​ ఓటమి దాదాపు ఖారారైంది. చివరి ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు కొట్టిన విండీస్ ఆటగాడు నర్స్​(19) పరుగుల తేడాను మాత్రం తగ్గించగలిగాడు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ 288 పరుగులు చేసింది. కౌల్టర్​నైల్(92), స్టీవ్ స్మిత్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. 38 ఓవర్లకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆసీస్​ను వీరిద్దరూ రాణించి జట్టుకు మంచి స్కోరునందించారు. 60 బంతుల్లో 92 పరుగులు చేసిన కౌల్టర్​ నైల్ కొద్దిలో శతకాన్ని మిస్​ చేసుకున్నాడు.

విండీస్ బౌలర్లలో బ్రాత్​వైట్ మూడు.. థామస్, షెల్డన్, రసెల్ తలో రెండు వికెట్లు తీశారు.

ABOUT THE AUTHOR

...view details