ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 86 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. లార్డ్స్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కివీస్‌కు 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 157 పరుగులకే చేతులెత్తేశారు. విలియమ్సన్(40), రాస్ టేలర్(30) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ మరోసారి ఐదు వికెట్లతో రెచ్చిపోగా.. బెహ్రెంన్డార్ఫ్ 2 వికట్లతో ఆకట్టుకున్నాడు. కమిన్స్, లయన్, స్మిత్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
కీలక సమయంలో అర్ధశతకంతో ఆకట్టుకున్న ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి(71) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఓపెనర్లు విఫలం..
లక్ష్య ఛేదనలో కివీస్ ఆరంభం నుంచి నిదానంగా ఆడింది. పదో ఓవర్లో ఓపెనర్ హెన్రీ నీకోల్స్(8)ను బెహ్రెండార్ఫ్ ఔట్ చేశాడు. అప్పటికీ జట్టు స్కోరు 29 పరుగులే. కాసేపటికే మరో ఓపెనర్ గప్తిల్(20)ను పెవిలియన్‌కు పంపాడు బెహ్రెండార్ఫ్.
కాసేపు పోరాడిన విలియమ్సన్ - టేలర్
అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ - టేలర్ జోడీ నిలకడగా ఆడింది. వీరిద్దరూ 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విలియమ్సన్‌ను ఔట్ చేసి స్టార్క్ ఈ ద్వయాన్ని విడదీశాడు. కాసేపటికీ టేలర్(30).. కమిన్స్ చేతిలో ఔటయ్యాడు. తర్వతా కివీస్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు.